మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. బిల్ గేట్స్ బృందంతో భేటీ కానున్నారు. ఈ భేటీలో సంజీవని ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. సంజీవని ప్రాజెక్టును.. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సహకారం చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంజీవని ప్రాజెక్టుతో పాటుగా ఇతర అంశాలపైనా బిల్ గేట్స్ బృందం.. ఏపీ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ కూడా సందర్శిస్తారు, పాలనలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే అంశాన్ని పరిశీలిస్తారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్ పనితీరు, డేటా డ్రైవన్ మానిటరింగ్ మెకానిజం గురించి చంద్రబాబు, ఇతర అధికారులు బిల్ గేట్స్‌కు వివరిస్తారు. అనంతరం స్వర్ణాంధ్ర విజన్ 2047 సంస్కరణపైనా చర్చిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద ప్రజారోగ్యం, వ్యవసాయ రంగం, విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి బిల్ గేట్స్‌కు వివరిస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా బిల్ గేట్స్ బృందం పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగం, ఏఐ పరికరాల ఉపయోగాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది.
ఏంటీ సంజీవని ప్రాజెక్టు..
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణగా ఏపీ ప్రభుత్వం సంజీవని పథకాన్ని రూపొందించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మాతా శిశుసంరక్షణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందించే ఆలోచనలో ఉన్నారు. సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ఉంటుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులలో పౌరులకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సల వివరాలతో పాటుగా, డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, వ్యాక్సినేషన్ వివరాలు నమోదవుతాయి. అలాగే రెండున్నర లక్షల వరకూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సంజీవని ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అక్కడ సత్ఫలితాలు రావటంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.


