
బ్రాండ్ పేరు చూసి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్‌లోని ప్రముఖ స్వీట్ షాప్ హల్దీరామ్స్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాణ్యతకు మారుపేరు అని చెప్పుకునే ఈ సంస్థ, కుళ్ళిపోయిన ఆహారాన్ని అమ్ముతూ సామాన్యుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అత్తాపూర్‌లోని హల్దీరామ్ స్వీట్ హౌస్‌లో స్వీట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు.. అవి పాడైపోయి ఫంగస్ పట్టి ఉండటాన్ని గమనించారు. పాడైపోయిన స్వీట్ల గురించి నిర్వాహకులని ప్రశ్నించగా, బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపించారు.
యాజమాన్యం తీరుతో విసిగిపోయిన బాధితులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్తీ, నాణ్యత లేని స్వీట్లను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో హల్దీరామ్ స్వీట్ హౌస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. ల్యాబ్ రిపోర్ట్ లో కల్తీ జరిగిందని తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో తనిఖీలు చేసిన ప్రతీసారి ఇలా కొన్ని స్వీటు షాపుల నిర్వాకం బయటపడుతూనే ఉంది. కల్తీ లేని ఆహారం.. నాణ్యమైన సేవలు’ నోరూరించే మిఠాయిల పేరుతో కుళ్ళిపోయిన స్వీట్లను అమ్ముతూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేరున్న సంస్థలే ఇలా చేస్తే, సామాన్యుడు ఎవరిని నమ్మి తినాలి? అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
