Mulapet Port Trail Run In April: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోర్టుల పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు కీలకమైన మూలపేట పోర్టు పనులు ఏకంగా 75శాతం పనులు పూర్తి చేశారు. ఏప్రిల్ నెలలో ట్రయల్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 25శాతం పనుల్ని కూడా ఈ ఏడాది నవంంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పోర్టుకు అనుబంధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా ఏర్పాటు కాబోతోంది.
హైలైట్:
- ఏపీలో కొత్త పోర్టులకు సంబంధించిన పనులు వేగవంతం
- మూలపేట పోర్టు పనులు కూడా 75శాతం పూర్తి చేశారు
- ఈ ఏప్రిల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు

మరోవైపు మూలపేట పోర్టుకు రోడ్డు, రైలు కనెక్ట్ చేసే పనులు జరుగుతున్నాయి.. పోర్టుకు సంబంధించిన తాగునీరు, విద్యుత్తు పనులు కూడా చేస్తున్నారు. పోర్టుకు కోల్‌కతా- చెన్నై నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేసేందుకు 12.85 కిమీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మూలపేట పోర్టుకు రైల్వే కనెక్టివిటీ కోసం చెన్నై-హౌరా రైల్వే లైన్‌ను.. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం దగ్గర నుంచి కనెక్ట్ చేస్తున్నారు. మొత్తం 7.8 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి. పోర్టుకు నీటి సరఫరా కోసం గొట్టా బ్యారేజీ నుంచి పోర్టు వరకు 50 కిలో మీటర్ల పొడువున పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. పోర్టుకు విద్యుత్ సరఫరా కోసం టెక్కలి మండలం రావివలస సబ్‌స్టేషన్ నుంచి స్తంభాల ఏర్పాటు చేయనున్నారు.
మూలపేట పోర్టుకు అనుసంధానంగా భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ పోర్టు పూర్తి చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఎంతో ఉపయోగం. లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయంటున్నారు. ఇప్పుడిప్పుడు పలువురు పారిశ్రామికవేత్తలో పోర్టుకు సమీపంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోర్టుకు అనుబంధంగా 10వేల ఎకరాలను గుర్తించి.. మూలపేటను ఇండస్ట్రయిల్ క్లస్టర్‌గా మార్చబోతోంది. అధికారులు వీలైనన్ని ఎక్కువ భూముల్ని గుర్తించే పనిలో ఉన్నారు.


