బుధవారం జరిగిన నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.పార్వతి, పరమేశ్వరుల ఉత్సవ మూర్తులు శ్రీముఖలింగం క్షేత్రం నుండి భారీ ఊరేగింపుగా నంది వాహనంపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారనదీ తీరంలోని మిర్యాపల్లి రేవుకు చేరుకున్నాయి. అక్కడ వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఉత్సవ మూర్తులకు నదిలో త్రిశూల చక్రతీర్థ స్నానం ఆచరించారు.నదీ గర్భం మధ్యలో ఎగువున ఆది దంపతులైన ఆ పార్వతి పరమేశ్వరులు స్నానమాడగా నదిలో దిగువ బాగాన ఆ నీటిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.
ఇలా పవిత్ర స్నానాలు చేయటం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నదిలో నీరు తక్కువగా ఉండటంతో ఈ ఘట్టం కోసం ఎగువున హిరమండలం వద్ద ఉన్న గొట్టా బ్యారేజ్ నుండి నదిలోకి కొంత మేర నీటిని విడిచిపెట్టారు. ఈ పవిత్ర స్నానాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగున ఉన్న ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. సుమారు 2కిలోమీటర్ల మేర జలమా.. జనమా అన్నట్టు నదీ తీరమంతా జనసంద్రమైంది. భక్తుల శివనామ స్మరణతో వంశధార నదీ తీరం పులకరించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మందితో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కమెండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి జిల్లా SP మహేశ్వర రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వంశధార నదిలో జరిగిన శ్రీ ముఖలింగేశ్వరుడి త్రిశూల చక్రతీర్థ స్నాన ఘట్టం నది పుష్కరాలను, కుంభ మేళాను తలపించేలా జరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

