ఏఐ అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదని, అది మానవ చరిత్ర గమనాన్ని మార్చే ఒక చారిత్రాత్మక మలుపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 100కు పైగా దేశాల నుంచి వచ్చిన నాయకులు, టెక్ నిపుణులతో సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఏఐ అభివృద్ధిలో భారత్ అనుసరించబోయే ఐదు సూత్రాల విధానాన్ని ప్రధాని మోదీ వివరించారు. MANAV అనే పదానికి ఆయన ఇచ్చిన నిర్వచనం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- M – Moral and Ethical: నైతిక విలువలతో కూడిన వ్యవస్థ.
- A – Accountable Governance: జవాబుదారీతనంతో కూడిన పాలన.
- N – National Sovereignty: జాతీయ సార్వభౌమాధికారం
- A – Accessible Technology: అందరికీ అందుబాటులో ఉండే సమ్మిళిత సాంకేతికత.
- V – Validated Systems: చట్టబద్ధమైన, చెల్లుబాటు అయ్యే వ్యవస్థలు.
వైర్‌లెస్ విప్లవం ఏఐ
గతంలో వైర్‌లెస్ కమ్యూనికేషన్ మొదలైనప్పుడు ప్రపంచం ఇంతలా అనుసంధానమవుతుందని ఎవరూ ఊహించలేదని, ఇప్పుడు ఏఐ కూడా అటువంటి పరివర్తననే తీసుకువస్తుందని మోదీ అన్నారు. ‘‘యంత్రాలు తెలివైనవిగా మారుతున్నాయి. ఇది మానవ సామర్థ్యాలను కొన్ని వందల రెట్లు పెంచుతుంది. అయితే మానవులు కేవలం డేటా పాయింట్లుగా మిగిలిపోకూడదు.. వారి సాధికారతే లక్ష్యంగా AI ఉండాలి’’ అని మోదీ స్పష్టం చేశారు.
భారతదేశమే ఏఐకి సరైన వేదిక
ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా, అత్యధిక టెక్ టాలెంట్ కలిగిన భారత్.. ఏఐ అభివృద్ధికి బలమైన కేంద్రంగా నిలుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ‘‘అందరి సంక్షేమం కోసం, అందరి శ్రేయస్సు కోసం అనే థీమ్‌తో భారత్ అడుగులు వేస్తోందన్నారు. మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి ఏఐని వదిలి వెళ్తున్నామనేదే నేటి అసలు బాధ్యత అని ఆయన అన్నారు.
సదస్సుకు హాజరైన ప్రపంచ నేతలు
ఈ సమ్మిట్‌లో 100 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, అబుదాబి క్రౌన్ ప్రిన్స్, శ్రీలంక అధ్యక్షుడు, మారిషస్ ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరై భారతదేశ ఏఐ విజన్‌ను అభినందించారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రధాని ప్రసంగాన్ని ఏఐ సాయంతో తెలుగులోకి అనువదించారు.
Tune in to PM @narendramodi’s India AI Impact Summit speech in Telugu.
(This is AI-generated audio)https://t.co/0WxuJTo9vz
— narendramodi_in (@narendramodi_in) February 19, 2026

