
జలపాతం అనగానే మనకు కొండలపై నుంచి పారే సెలయేళ్లు గుర్తొస్తాయి. నయాగరా, విక్టోరియా, ఏంజెల్ ఫాల్స్.. ఇవన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జలపాతం ఒక ఎత్తు. పాల నురగలా జారిపడే నీటిని చూసి మనం మురిసిపోతాం. కానీ మీరు ఎప్పుడైనా సముద్రం లోపల జలపాతాన్ని ఊహించారా? అవును అది కూడా ఏదో చిన్న జలపాతం కాదు.. భూమిపై ఉన్న ఎత్తైన జలపాతాల కంటే కొన్ని రెట్లు పెద్దదైన మహా జలపాతం సముద్ర గర్భంలో దాగి ఉంది. దీనిని శాస్త్రవేత్తలు డెన్మార్క్ జలసంధి కంటిశుక్లం అని పిలుస్తారు. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్ మధ్య ఉండే డెన్మార్క్ జలసంధిలో ఈ అద్భుతం నెలకొంది. భూమిపై ఉన్న ఎత్తైన జలపాతం ఏంజెల్ ఫాల్స్ ఎత్తు కేవలం 979 మీటర్లు అయితే ఈ సముద్ర గర్భ జలపాతం ఏకంగా 3,500 మీటర్ల లోతుకు దూకుతుంది. అంటే ఏంజెల్ ఫాల్స్ కంటే ఇది మూడు రెట్లు ఎత్తైనదన్నమాట.
అసలు ఈ జలపాతం ఎలా ఏర్పడింది?
పై నుంచి చూస్తే ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల ఇంత పెద్ద జలపాతం ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న అసలు కారణం.. నీటి సాంద్రత, ఉష్ణోగ్రతల్లో తేడా. గ్రీన్‌లాండ్ వైపు నుంచి వచ్చే అత్యంత చల్లని, బరువైన నీరు దక్షిణం వైపు ప్రవహిస్తూ వస్తుంది. ఇది డెన్మార్క్ జలసంధిలోని నీటి అడుగున ఉండే భారీ శిఖరాన్ని చేరుకోగానే, అక్కడున్న వెచ్చని, తేలికపాటి అట్లాంటిక్ నీటిని ఢీకొంటుంది. సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల చల్లని నీరు ఒక్కసారిగా వెచ్చని నీటి పొరల కిందకు భారీ జలపాతంలా వేగంగా దూసుకుపోతుంది.
భూమిని కాపాడే శక్తి
ఈ జలపాతం కేవలం ఒక వింత మాత్రమే కాదు, మన భూమిని కాపాడే శక్తి. దీనిని గ్లోబల్ కన్వేయర్ బెల్ట్‌లో ప్రధాన భాగం అని పిలుస్తారు. సముద్రాల్లో వేడిని పంపిణీ చేస్తూ భూమి వాతావరణం సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. ముఖ్యంగా యూరప్ గడ్డకట్టకుండా ఉండటానికి ఈ ప్రవాహమే కీలక కారణం. ఇది గనుక ఆగిపోతే ప్రపంచ వాతావరణం అస్తవ్యస్తమవుతుంది.
కంటికి కనిపించని మహాద్భుతం
సోనార్ టెక్నాలజీ, లోతైన సముద్ర పరికరాల ద్వారానే శాస్త్రవేత్తలు ఈ జలపాతాన్ని గుర్తించారు. సెకనుకు మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీరు ఇక్కడ కిందికి దూకుతుంది. మన కంటికి నేరుగా కనిపించకపోయినా, భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన సహజ శక్తుల్లో ఇది ఒకటి.
