చాలామంది వారం మొత్తం కష్టపడి, శని లేదా ఆదివారాల్లో చిల్ అవ్వడానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. రోజూ తాగడం లేదు కదా.. వారానికి ఒక్కరోజే కదా.. ఏమవుతుందిలే అని సరిపెట్టుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి వారానికి 60 మి.లీ. వరకు ఆల్కహాల్ తాగితే అది చాలా మందికి సురక్షితమైన పరిమితి. కానీ అప్పుడప్పుడు తాగినా సరే, పరిమితికి మించి పెగ్గుల మీద పెగ్గులు వేస్తే అది శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
బింజ్ డ్రింకింగ్: వారమంతా తాగకుండా ఒక్కరోజే భారీగా మద్యం సేవించడాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. ఇది రోజూ కొంచెం తాగడం కంటే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గుండె, కాలేయంపై నేరుగా ప్రభావం పడి, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఆల్కహాల్ నేరుగా రక్తంలోకి శోషించబడటం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది.
శరీరానికి కొవ్వు ముప్పు: మద్యంలో కేలరీలు చాలా ఎక్కువ. దీనికి తోడు సైడ్ డిష్‌గా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో ముఖ్యంగా పొట్ట మరియు తొడల భాగంలో కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఇది మెటబాలిజంను నెమ్మదింపజేసి, బరువు పెరిగేలా చేస్తుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు: మద్యం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. బీపీ పెరగడం, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. క్రమం తప్పకుండా లేదా అధికంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని, మతిమరుపు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
వారానికి ఒక్కసారే కదా అని అతిగా తాగడం అంటే మీ ఆరోగ్యానికి మీరే స్వయంగా రెడ్ సిగ్నల్ ఇచ్చుకోవడమే. వినోదం కోసం తాగినా, అది వ్యసనంగా మారకుండా చూసుకోవడం ఉత్తమం.






