
నయం కాని రోగాలతో ఇక్కడకు వస్తే అంతా నయమైపోతాయని అక్కడి ప్రజల నమ్మకం..! కొన్ని ఏళ్ళ తరబడి ఇక్కడికే వచ్చి.. అక్కడ ఇచ్చే నూనెని, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకుంటే నొప్పి మటుమాయం అవుతుందట. ఇది స్థానిక ప్రజల నమ్మకంతో నిత్యం తరలి వచ్చే జనాలతో జాతర తలపిస్తోంది.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం అంబకపల్లి గ్రామంలో శ్రీఅవధూత ఆవుల స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆవుల స్వామి అంబకపల్లి ప్రాంతంలో గోవులను కాసుకుంటూ జీవనం సాగించేవారట. ఎంతో మంది స్థానిక ప్రజలు విష పురుగులు, అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది చూడలేక, ఆముదం నూనెను తన సంకలో నుండి తీసి, ఆ చమురును ప్రజలకు పట్టించేవారు. తద్వారా నయం కాని రోగం కూడా తగ్గించేవాడని చెబుతారు. జీవ సమాధి అయిన ఆవుల స్వామి ఎన్నో రోగాలను నయం చేశారట. ఇదే ఇరుగుపొరుగు ప్రచారం కావడంతో పెద్ద ఎత్తున జనం రావడం కొనసాగుతోంది.
ఆవుల స్వామి వద్దకు వెళ్ళి నొప్పి ఉన్నచోట నూనెను రాసుకొని ఒక రాత్రి అక్కడ నిద్రిస్తే, ఎలాంటి వ్యాధులను అయినా నయం చేసే శక్తి ఉందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఎంతటి విషపూరితమైన పాము కరిచినప్పటికీ నూనెను పట్టిస్తే నయమవుతుందట. కళ్ళలో కలికం వేస్తే తల నొప్పి, దగ్గు, పడిసెం లాంటి జబ్బులు నయం అవుతాయట. ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాలలో విష పురుగులు తిరుగుతూ ఉంటే ఆవుల స్వామి వద్ద నుంచి కొన్ని నీటిని తీసుకొని వచ్చి ఆ ప్రాంగణంలో చల్లితే అక్కడ విషపురుగులు తిరగమని చాలామంది ప్రజలు చెబుతున్నారు.
ఎంతో మహత్యం కలిగిన ఆవుల స్వామికి ప్రతి ఏటా శివరాత్రి వారం ముందు ఆదివారం ఆవుల స్వామి ఆరాధనను నిర్వహిస్తారు. ఈ ఆరాధన కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారు. అంబకపల్లి గ్రామంలో కూడా ఆదివారం మాంసం ఊరులోకి రానివ్వరు. అక్కడి ప్రాంత వాస్తులకు ఆదివారం అంటే స్వయంగా ఆవుల స్వామి అని ఒక నమ్మకం..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

