ఉన్నత చదువు చదివిన ఓ వ్యక్తి దారి తప్పి గంజాయి స్మగ్లర్‌గా మారిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది, అయితే నిందితులు గంజాయి తరలిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులకు దొరికిపోయారు. హరిబాబు అనే వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఓ సారి జైలుకు వెళ్లాడు. అక్కడైన పరిచయాలతో బయటకు రాగానే బొలెరోలు కొనుగోలు చేసి వాటికి రహస్య అరలు ఏర్పాటు చేయించి గంజాయి అక్రమ రవాణా ప్రారంభించారు. అయితే సోమవారం రోజు ఈ ముఠా నర్సీపట్నం పోలీసులకు దొరికిపోయింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సైదులుపేటకు చెందిన హరిబాబు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కంప్యూటర్స్ సైన్స్ వరకూ చదివిన హరిబాబు.. గంజాయితో పోలీసులకు దొరికిపోయి 2018లో తొలిసారిగా జైలుకు వెళ్లాడు. జైలులో గంజాయి నిందితులతో హరిబాబుకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సాయంతో వారంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు బొలెరో వాహనాలను కొనుగోలు చేయించాడు హరిబాబు. ఆ తర్వాత ఆ బొలెరోలలో ఎవరికీ కనిపించకుండా ఉండేలా రహస్య అరలు ఏర్పాటు చేయించాడు.
ఆ తర్వాత హరిబాబు తన వ్యాపారం మొదలుపెట్టాడు. గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేయటం, బొలెరోలలోని రహస్య అరలలో వాటిని దాచి అక్రమంగా సరఫరా చేయటం ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన కూరగాయలు ఉంచి.. లోపల మాత్రం గంజాయి ప్యాకెట్లు ఉంచి రవాణా చేయటం ప్రారంభించారు. ఈ రకంగా పోలీసులను మస్కా కొట్టి ఇప్పటి వరకూ 12 సార్లు గంజాయి రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితేఈ సారి మాత్రం అతని ఎత్తులు పారలేదు.
తమిళనాడులోని దిండిగల్‌కు గంజాయి తరలిస్తూ నర్సీపట్నం పోలీసులకు హరిబాబు ముఠా దొరికిపోయింది. ఐదుగురు సభ్యులు పోలీసులకు దొరకగా.. ఇద్దరు పరారయ్యారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువస్తూ నాతవరం మండలం వెదురుపల్లి వద్ద దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.


