ఈ రోజుల్లో వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అవసరమైన ఆర్థిక రక్షణగా మారింది. అయితే పాలసీ తీసుకునే ముందు కొన్ని ముఖ్య విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సరైన సమ్ ఇన్షూర్డ్ ఎంపిక.. పాలసీలో ఎంత మొత్తానికి కవరేజ్ తీసుకోవాలనే విషయం అత్యంత కీలకం. నగరాల్లో వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో కనీసం రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల వరకు కవరేజ్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ పరిమాణం, జీవనశైలిని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
వెయిటింగ్ పీరియడ్ వివరాలు.. చాలా పాలసీలలో కొన్ని వ్యాధులకు వెంటనే కవరేజ్ ఉండదు. ముందుగా ఉన్న వ్యాధులకు (pre-existing diseases) సాధారణంగా 2–4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ నిబంధనలు స్పష్టంగా చదవడం అవసరం.
నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితా.. క్యాష్‌లెస్ చికిత్స పొందాలంటే ఇన్సూరెన్స్ కంపెనీకి అనుబంధ ఆసుపత్రులు ఉండాలి. మీ నివాస ప్రాంతానికి దగ్గరలో మంచి నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేయాలి.
కో-పే, సబ్‌లిమిట్స్.. కొన్ని పాలసీలలో చికిత్స ఖర్చులో కొంత శాతం మీరు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే కో-పే అంటారు. అలాగే గది అద్దె, ప్రత్యేక చికిత్సలపై పరిమితులు (sublimits) ఉండొచ్చు. ఇవి భవిష్యత్తులో మీ ఖర్చును పెంచే అవకాశం ఉంది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో.. ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌లను ఎంత శాతం పరిష్కరిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉన్న కంపెనీలను ఎంపిక చేయడం సురక్షితం.







