రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళనాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.. మొన్నటి వరకు అక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నది డీఎంకే, అన్నాడీఎంకే రెండు కూటములు మాత్రమే.. తాజాగా ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టివికే కూడా బరిలో ఉంది. ఇవి చాలదు అన్నట్లు ఇప్పుడు కొత్త పార్టీతో జయలలిత నెచ్చెలి శశికళ కూడా వస్తున్నారు. అంటే ఈ సారి తమిళనాడు ఎన్నికల పోరులో చతుర్ముఖ పోరు తప్పేలా లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఉన్నట్టుండి చిన్నమ్మ రాజకీయ పార్టీ ఏర్పాటు ఎవరి కోసం..? అదే ఇపుడు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఉన్నప్పుడు అన్ని తానే నడిపిన నాయకురాలు శశికళ అన్నది అందరికీ తెలిసిన విషయం. జయలలిత మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి విడుదలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న శశికళ ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ఇప్పటికే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో ఓ పార్టీ ఉంది. మళ్లీ ఎప్పుడు శశికళ మరో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నదే ఇప్పుడు తమిళనాడులో చర్చినీయాంశంగా మారగా ఎందుకు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళనాడులో గతంలో రెండు కూటముల్లో ఉన్న పార్టీలు ఇప్పుడు అదే చోట లేదు. ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి.. ఒకప్పుడు డీఎంకే తో ఉన్న పార్టీలు అన్నా డీఎంకే తో కలిస్తే తాజాగా అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు మారాయి.. ఇక అన్నా డీఎంకే లో చక్రం తిప్పిన నేతలు మాజీ ముఖ్యమంత్రి సైతం డీఎంకే గెలుపు కోరుతుండడం మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
ఆసక్తికరమైన రాజకీయాలకు కేరాఫ్ గా నిలిచే తమిళనాడులో ఇపుడు చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.. తాజా పరిణామాలు అక్కడి రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మొదటి నుంచీ డీఎంకే , అన్నాడీఎంకే అంటే ఉప్పు.. నిప్పు.. రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కీలక నేతల ఆలోచనా తీరులో మార్పు వస్తోంది. జయలలిత ఉన్నపుడు అన్నీ తానై నడిపిన శశికళకు కూడా ఇప్పుడు డీఎంకే గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు డీఎంకేతో సుదీర్ఘ కాలం కలిసి నడిచిన పీఎంకే పార్టీ ఇప్పుడు అన్నాడీఎంకే బీజేపీ కూటమితో జతకట్టింది. పీఎంకే అంటే తమిళనాడులో బలమైన వన్నియర్ సామాజికవర్గ ఓటు బ్యాంకు కలిగిన పార్టీ..
ఇక నటుడు దివంగత విజయ్ కాంత్ కు చెందిన డీఎండీకే పార్టీ డీఎంకే తో చేతులు కలిపింది. గతంలో 2011 ఎన్నికల్లో జయలలితతో కలిసి పోటీ చేసి విజయం సాధించి అధికారం దక్కించుకున్న చరిత్ర విజయ్ కాంత్ పార్టీకి ఉంది. అలాంటిది ఇపుడు అనూహ్యంగా డీఎంకేతో జత కట్టింది డీఎండీకే. పీఎంకే, డీఎండీకే అటు ఇటు మారాయి.
ఇక కీలకమైన మరో రెండు పరిణామాలు కూడా ఉన్నాయి.. అందులో ఒకటి మాజీ సీఎం జయలలిత నమ్మిన బంటు ఓ పన్నీర్ సెల్వం డీఎంకే కు మద్దతుగా నిలవడం. సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఓపీఎస్ భేటీ అయిన
స్టాలిన్‌కు మద్దతు తెలిపారు. డీఎంకే ఐదేళ్ల పాలనను పొగిడిన ఓపీఎస్.. వచ్చే ఎన్నికల్లో డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని ఓపీఎస్ అన్నారు. తమిళనాడులో గంటగంటకు మారుతున్న రాజకీయ పరిణామాలతో ఎవరు ఎప్పుడు ఎవరితో కలుస్తారో గ్యారెంటీ లేని పరిస్థితి నెలకొంటోంది.
కాగా అన్నాడీఎంకే టార్గెట్ గా పలు రాజకీయ పార్టీలు రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాయి. ఒకప్పుడు తాను సారథ్యం ఆశించిన అన్నాడీఎంకే టార్గెట్ గా పార్టీ పెట్టేందుకు శశికళ ఏర్పాట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకులో ప్రధానంగా దేవర్ సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీమంత్రి సెంగోట్టియన్ ఆ పార్టీని వీడి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే కు మద్దతుగా నిలుస్తున్నారు. మరో వైపు అదే సమాజిక వర్గానికి చెందిన శశికళ కూడా కొత్తగా పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు కు గండి కొట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నాడీఎంకేను మ్యాగ్జిమ్ డ్యామేజ్ చేసి విజయ్ పార్టీకి సహకరించడమే శశికళ ఎత్తుగడ అన్న ప్రచారం కూడా జరుగుతోంది.
జయలలిత జయంతి సభలో శశికళ పార్టీ ప్రకటన చేశారు. తమ పార్టీ జెండా అజెండా ఏంటన్నది వివరించారు.. పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.. మొత్తానికి ఎన్నికల తేదీని ఈసీ ప్రకటించకముందే తమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.

