ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు రాజీనామా చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కీలక విజ్ఞప్తి చేశారు. తమ పదవులకు తాము రాజీనామా చేశామని.. వాటికి ఆమోదం కల్పించాలని కోరారు. వైసీపీ చేసిన పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మండలి ఛైర్మన్ మోషన్ రాజు ముందు.. ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ హాజరై తమ వాదనలు వినిపించారు.

వైసీపీ పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు .. ఇవాళ వేర్వేరుగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి రాజీనామాలపై మోషేన్ రాజు వివరణ అడిగి తెలుసుకున్నారు. స్వతహాగా రాజీనామా చేశారా లేక ఎవరైనా ఒత్తిడి తీసుకువస్తే.. రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అయితే తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. అందుకే తక్షణమే తమ రాజీనామాలకు ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ కూడా తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు విచారణ జరపాల్సి ఉంది. అయితే తాను వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంవత్సరం అయిందని.. కానీ ఇంకా తన రాజీనామాను ఆమోదించడం లేదని జయమంగళం వెంకట రమణ.. ఇప్పటికే ఛైర్మన్ మోషేన్ రాజును కోరారు. బుధవారం మండలి ఛైర్మన్ ఎదుట విచారణకు హాజరైన జయమంగళం వెంకటరమణ.. జనసేన పార్టీ కండువా కప్పుకుని రావడం గమనార్హం.
విచారణ తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన జయమంగళం వెంకటరమణ.. తన రాజీనామాను ఆమోదించాలని ఇప్పటికే పలుమార్లు కోరినా ఎందుకు ఆమోదం కల్పించడం లేదని మండలి ఛైర్మన్‌ను అడిగినట్లు చెప్పారు. ఇదే విషయంపై తాను గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేసి.. అధికారికంగా జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. అందుకే జనసేన కండువాతో విచారణకు హాజరైనట్లు చెప్పారు. ఛైర్మన్ ఎదుట ఇతర పార్టీ కండువా కప్పుకుంటే.. సస్పెండ్ చేయవచ్చని.. కానీ తన రాజీనామా విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తాను ఛైర్మన్‌ను అడిగినట్లు జయమంగళం వెంకటరమణ తెలిపారు.


