
ఫోన్ తక్కువ వాడాలని తల్లిదండ్రులు మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్లే.. ఫస్ట్‌లాన్సర్, సయ్యద్ నగర్‌లో నివసించే అఫాన్ ఖాన్ సమీప ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి రెండో మరో వివాహం చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి మారు తల్లే అతని ఆలనా పాలనా చూస్తుంది.
తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అఫాన్ మొబైల్‌లో వీడియోలు, గేమ్స్ చూస్తూ స్కూల్‌కు డుమ్మా కొట్టవాడు. ఇప్పటికే మూడు స్కూళ్లు మారాడు, స్కూల్‌కు సరిగ్గా వెళ్లకుండా ఇంట్లోనే గేమ్స్ ఆడతూ ఉండేవాడు. తండ్రి స్కూలుకు వెళ్లకుండా ఇవేం అలవాట్లని మందలించడంతో భరించలేకపోయాడు. ఫిబ్రవరి 24 ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలుడిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే కిందకు దించి చూశారు. అప్పటికే బాలుడు చనిపోయినట్టు గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
