మొత్తానికి మత్తు వదలింది. ఇన్నాళ్లు అంటుకున్న బురద తొలగి కడిగిన ముత్యంలా వాళ్లంతా బయటపడ్డారు. అసలు సాక్ష్యాలు లేని కేసుపై ఎందుకిన్నిరోజులు దర్యాప్తు కొనసాగింది. నిజంగానే పొలిటికల్ వెండెట్టాలో వాళ్లను టార్గెట్ చేశారా..? ఆదారాలను నాశనం చేయడంతో బోనులో నిలెబెట్టలేకపోయారా..? ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. శుక్రవారం నిర్దోషిగా విడుదల చేసింది. మొత్తం 23 మందిని నిర్దోషులుగా తేల్చింది కోర్టు. కేజ్రీవాల్ సిసోడియా, కవితతో పాటు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, మోతా గౌతమ్, సమీర్ మహేంద్రు,అమన్‌దీప్ సింగ్ ఢాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గొరంట్ల, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చన్‌ప్రీత్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చంద్ మాథూర్, శరత్ రెడ్డి పేర్లు ఉన్నాయి.
దర్యాప్తులో జరిగిన లోపాలపై కోర్టు సీబీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వేల పేజీల చార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్ష్యాలు లేవని పేర్కొంది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు చూపడంలో సీబీఐ పూర్తిగా విఫలమైందని ,కేజ్రీవాల్‌పై బలమైన ఆధారాలు లేకుండానే కేసులో చేర్చారని కోర్టు మండిపడింది.చార్జ్‌షీట్‌లో ఉన్న విషయాలు సాక్షుల వాంగ్మూలాలకు సరిపోవడంలేదని కోర్టు వ్యాఖ్యానించింది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు ఉన్నాయని కూడా పేర్కొంది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై ఎటువంటి ఆధారాలు లేకపోయినా అయనను ఏ1గా చేర్చడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మద్యం విధానం రూపకల్పన, అమలులో కీలక పాత్ర వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా కేసులో చేర్చడం చట్టపరంగా నేరంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై నిరాధారఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసిన సీబీఐ అధికారులను విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చింది..
మరోవైపు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినంతమాత్రాన వీళ్లంతా సుద్దపూసలేం కాదంటోంది ఢిల్లీ బీజేపీ. ఆల్రెడీ వీరికి ప్రజాకోర్టులో శిక్షపడిందని, పైకోర్టులో తేల్చుకుంటాని చెబుతోంది. విచారణ సమయంలోనే నిందితులంతా చాలా షార్ప్‌గా రియాక్ట్ అయి ఆధారాలను నాశనం చేశారని, మరి సాక్ష్యాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ. ఇంతటితో కేసు క్లోజ్ కాలేదని, ముందుంది ముసళ్ల పండుగ అంటూ మరో బాంబ్ పేల్చింది. అంటే కేసు ఢిల్లీ కోర్టుతోనే క్లోజ్ కాదని ఇన్‌డైరెక్ట్‌గా బీజేపీ నేతలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆధారాలు లేని కేసు, సుప్రీంకోర్టుకు వెళ్తే నిలుస్తుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మూడేళ్లుగా ఆప్ నేతలను నిద్రలేకుండా చేసిన లిక్కర్ కేసు ప్రస్తుతానికైతే క్లోజయింది. కానీ సమాధానం దొరకని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. లిక్కర్ కేసు ఇప్పటికీ అర్థం కాని బ్రహ్మపదార్ధమే. అలాగని ఇలాంటి కేసుల్లో శిక్షలు పడతాయనుకోవడంకూడా మన భ్రమే అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆధారాలు లేకుండానే సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ కేసును టేకప్ చేసి, ఇన్నిరోజులు విచారణ చేస్తుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మద్యం వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులతో తీసుకొచ్చిన విధానమే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ. ఇది 2021 నవంబర్‌లో అమల్లోకి వచ్చింది. మామూలుగా 2021కి ముందు ప్రభుత్వ దుకాణాలు, ప్రైవేట్ దుకాణాలు కలిసి నియంత్రిత ధరలతో మద్యం అమ్మకాలు సాగేవి. కానీ కొత్త లిక్కర్ పాలసీ మాత్రం లిక్కర్ వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం విక్రయాల నుంచి తప్పుకుంది. అంటే ధరలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. ప్రైవేట్ దుకాణదారులదే ఫైనల్ డెసిషన్. ఢిల్లీని రిటైల్ జోన్లుగా విభజించి, వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు వేలం వేసింది. లైసెన్సుదారులకు ధరలు నిర్ణయించడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కొత్త పాలసీ ప్రకారం సప్లై చైన్ స్టక్చర్ కూడా మార్చారు. తయారీ దారులు హోల్ సేలర్స్‌గా పనిచేయకుండా రూల్ పెట్టారు. రిటైల్ షాప్స్ తప్పనిసరిగా ఇండిపెండెంట్ హోల్ సేలర్స్ నుంచే స్టాక్ కొనాలని అన్న కండీషన్ పెట్టారు. ప్రొడక్షన్ నుంచి రిటైల్ వరకు ఒకే నెట్ వర్క్ కంట్రోల్‌లో ఉండకూడదనే ఐడియాతో ఈసిస్టమ్‌ను ఆప్ సర్కార్ డిజైన్ చేసింది. ఈపాలసీ ద్వారా ప్రభుత్వం మూడు మెయిన్ గోల్స్ పెట్టుకుంది. నంబర్ 1 ఎక్సైజ్ రెవెన్యూ పెంచడం, నంబర్ 2 లిక్కర్ డిస్ట్రిబ్యూషన్‌లో పారదర్శకత ఉండేలా చూడడం, నంబర్ 3 ఇల్లీగల్ లిక్కర్ సేల్స్ తగ్గించడం. ఇలా మూడు లక్ష్యాలతో ఈపాలసీ 2021 నుంచి 2022 జూలై వరకు అమలైంది. అయితే కొత్త పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. లైసెన్స్ కండీషన్స్, షాప్ లొకేషన్స్, అప్రూవల్స్‌పై డిస్ప్యూట్స్ రావడంతో పాలసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
అయితే లిక్కర్ పాలసీపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ, ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్‌కుమార్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 2022 జూలైలో నరేష్ కుమార్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌లో ఎన్నో అవకవతవకలు ఉన్నాయని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కొన్ని డెసిషన్స్ కేబినెట్ అప్రూవల్స్ లేకుండానే తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రైవేట్ లైసెన్స్ హోల్డర్స్‌కి అండర్ బెనిఫిట్ కలిగించేలా పాలసీని రూపొందించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాలతో ఒకేసారి రెండు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవకతవకలు పాల్పడటం, అవినీతి, కుట్ర అంశాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా, మనీలాండరింగ్‌పై ఈడీ ఇన్విస్టిగేషన్ మొదలైంది. దర్యాప్తు సంస్థల వెర్షన్ ప్రకారం పాలసీ మేకింగ్‌లో చేసిన చేంజెస్, కొన్ని సెలెక్టెడ్ లిక్కర్ హోల్ సేలర్స్ , రిటైలర్స్‌కు బెనిఫిట్ కలిగించేలా ఉన్నాయని, టెండర్ ప్రాసెస్‌లోనూ, లైసెన్స్ ఫీ స్ట్రక్చర్‌లోనూ చేంజెస్ జరిగాయని, అర్హత నియమాలను కూడా వారికి అనుగుణంగా మార్చారని అడ్మినిస్ట్రేషన్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదని సీబీఐ ఆరోపించింది. పాలసీ డెసిషన్స్ వల్ల ప్రైవేట్ ఏజెన్సీలు ఫైనాన్షియల్ పరంగా లాభం పొందగా, ప్రభుత్వ ఖజానాకు భారీగా లాస్ వచ్చిందని దర్యాప్తు సంస్థలు వాదించాయి. హోల్ సేల్ మార్జిన్ స్ట్రక్చర్ మార్చడం కేసులో కీలకంగా ఉందని టర్నోవర్ రిక్వైర్ మెంట్ తగ్గించడంవల్ల కొన్ని కంపెనీలు లైసెన్స్ పొందే అవకాశం వచ్చిందని కోర్టుకు తెలిపింది.
అప్పటి ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా పాలసీ డెసిషన్‌లో కీరోల్ వహించారన్న దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. పాలసీ డ్రాఫ్ట్ డిస్కషన్ సమయంలో చేంజెస్ జరిగాయని, కొన్ని డెసిషన్స్ సెలెక్టెడ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు అడ్వాంటేజ్‌గా ఇచ్చాయని ఆరోపిస్తూ, 2023 ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. తరువాత మనీలాండరింగ్ కేసులోనూ అరెస్ట్ చేశారు. అయితే కేబినెట్ నిర్ణయాల ప్రకారమే పాలసీ తీసుకొచ్చారని, ఇల్లీగల్ పేమెంట్ తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని డిఫెన్స్ వాదించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా, లేటర్ స్టేజ్‌లో అరవింద్ కేజ్రీవాల్ పై కూడా అలిగేషన్స్ వచ్చాయి. కొన్ని బిజినెస్ గ్రూప్స్‌కి పాలసీ బెనిఫిట్స్ ఇవ్వడానికి కుట్ర జరిగిందని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆరోపిస్తూ కేజ్రీవాల్‌ను 2024 మార్చిలో ఈడీ అరెస్ట్ చేయగా, అదే ఏడాది జూన్‌లో CBI కూడా అరెస్ట్ చేసింది.
మరోవైపు ఢిల్లీ కొత్త మద్యం పాలసీ ఆ రాష్ట్రానికి సంబంధించిందే అయినా, దక్షిణాదికి చెందిన పలువురు రాజకీయ నాయకులతోపాటు వారి సన్నిహితులకు కూడా ఈ అవినీతి, అక్రమాల్లో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కవిత, ఆమె భర్తకు కూడా ఇందులో పాత్ర ఉందంటూ సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో పలుమార్లు ప్రస్తావించాయి. అలాగే ఏపీకి చెందిన వైసీపీ సిట్టింగ్ ఏంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడికి కూడా సంబంధమున్నట్లు ఆరోపణలున్నాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వార్తలొచ్చాయి. ఇందులో తెరవెనుక ఉండి, తమ సన్నిహితుల ద్వారా కథంతా నడిపినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. పాలసీ రూపకల్పన సమయంలోనే ఎమ్మెల్సీ కవిత ప్రతినిధులుగా అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు వ్యవహరించారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వామిగా చేరేందుకు కవిత ఆసక్తి చూపినట్లు ఈడీ పేర్కొంది. కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ముత్తా గౌతమ్ సౌత్ గ్రూప్ పేరుతో ఒక్కటైనట్లు పేర్కొంది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో , కవితతో చర్చించి 65శాతం వాటాలకు సమీర్ మహేంద్రు అంగీకరించినట్లు ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో వివరించింది. నిందితుల్లో పలువురు ఈ కేసులో సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ధ్వంసం చేశారని, ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, సిమ్ కార్డులు మార్చారని దర్యాప్తు సంస్థలు వాటి నంబర్లతోసహా చార్జిషీట్లలో పేర్కొన్నాయి.
ఇదేమీ సాధారణ విషయం కాదు. పట్టుబడి, జైల్లో మగ్గినవారంతా సామాన్యులు కాదు. అప్పట్లో ముఖ్యమంత్రులు, డీప్యూటీ సీఎంలు, మంత్రులు, మాజీ ఎంపీలు.. ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకనేతలు..ఢిల్లీలో సంప్రదాయ పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టి, టోటల్ రాజకీయ సమీకరణాలనే మార్చేసిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీ గద్దెపై తిరుగులేని పార్టీగా ఆధిపత్యం చలాయించింది. అలాంటి ఆప్ ..లిక్కర్ కేసు తర్వాత ఏక్‌దమ్ చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, కీలకనేతలు జైలుకు వెళ్లడంతో పార్టీపై భారీ ఇంపాక్ట్ పడింది. కేజ్రీవాల్ సుమారు 156 రోజులు జైలు జీవితం గడిపారు 2024 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్ట్ బైల్ వచ్చాక విడుదలైనా ఆప్ పుంజుకోలేకపోయింది. ఒక సిట్టింగ్ సీఎం అరెస్ట్ కావడం నేషనల్ పొలిటికల్ డిబేట్‌గా మారింది. దాని ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ ఓటమినే కాదు, అవమానాలను మూటగట్టుకుంది. అందుకే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చాక ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీ , ఆప్ నేతలు కుమ్మక్కు కావడం తోనే ఇలా జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే నిజమైన శత్రువు అన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఇదంతా ఒక ఎత్తైతే, తెలంగాణ స్టేట్‌లో కవితపై లిక్కర్ కేసు మరక పడటం మరో ఎత్తు. ఈకేసుతో కవిత వ్యక్తిగతంగానే కాదు, రాజకీయంగానూ తీవ్రంగా నష్టపోయారు. ఆమె అరెస్ట్, హియరింగ్స్.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇది హై-ఇంపాక్ట్ ఈవెంట్‌గా మారింది.
మరోవైపు బీఆర్ఎస్ టాప్ లీడర్ అరెస్ట్ కావడం పార్టీ ఇమేజ్‌పై డైరెక్ట్ ప్రెజర్ తెచ్చింది. కవిత అరెస్ట్ టైమింగ్ పాలిటికల్ కాంటెక్స్ట్‌లో పెద్ద డిబేట్‌కు దారి తీసింది. అయితే రెండేళ్ల కిందట టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూలో మాజీసీఎం కేసీఆర్ మాట్లాడారు.ఇదంతా రాజకీయ కక్ష్యలో భాగమేనని, తన బిడ్డ కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు కేసీఆర్. అయితే రెండేళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. లిక్కర్ కేసు పుణ్యమాని కవితకు తన కుటుంబానికి గ్యాప్ ఏర్పడింది. కవిత అరెస్ట్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పటికీ వ్యక్తమవుతోంది. ఇదే అభిప్రాయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ట్వీట్ చేశారు. తన అన్నచేసిన ట్వీట్‌పై కవిత కాస్త కోపంగానే రియాక్ట్ అవుతూ, తన అరెస్ట్‌కు బీఆర్ఎస్ ఓటమికి సంబంధంలేదన్నారు. బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి లిక్కర్ కేసే కారణమని ప్రచారం చేశారని, తనపై తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు కవిత.
ఇలా ఒక కీలకనేతల రాజకీయాన్ని తలకిందులు చేసిన లిక్కర్ కేసు ప్రస్తుతమైతే క్లోజ్ అయింది. అయినా ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు సమర్పించిన వేల పేజీల సాక్ష్యాల్లో నేరాన్ని నిర్ధారించే ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పడం, మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందంటున్నారు విశ్లేషకులు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి నేతలు నెలల తరబడి జైలు శిక్ష అనుభవించడం వెనుక ఉన్న ప్రధాన కారణం మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని కఠినమైన నిబంధనలే. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, వారు నిర్దోషులని నిరూపించుకునే భారం నిందితులపైనే ఉంటుంది. దీనివల్ల విచారణ పూర్తికాకముందే శిక్ష గా పరిణమించే సుదీర్ఘ జైలు జీవితాన్ని వారు గడపాల్సి వచ్చింది. రాజకీయ నేతలకు పరువే ప్రదాన ఆస్తి. ఇలాంటి కేసులతో వారి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ ప్రిస్టేజ్, పొలిటికల్ మైలేజ్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత విషయంలో ఇదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల దృష్టిలో ఒకసారి నిందితులు గా ముద్ర పడిన తర్వాత, కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా ఆ ముద్రను చెరిపివేయడం కష్టమవుతుందని, ఇది కేవలం వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు, తాము ప్రాతినిధ్యం వహించే పార్టీల మనుగడపై కూడా పెద్ద దెబ్బ తీస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లిక్కర్ కేసు బాధితులు
తగిన సాక్ష్యాలు లేకుండా అభియోగాలు మోపడం, కోర్టులో నిలబడని వాదనలు వినిపించడం వల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టినట్లు తేలితే, వారిపై చర్యలు తీసుకునే బలమైన చట్టాలు మన దగ్గర లేవు..వీటిపైఇప్పటికైనా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశీలకులు. మరోవైపు లిక్కర్ కేసుపై ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినంతమాత్రాన అప్పుడే కేసు ముగిసినట్లు కాదు. ఇంకా మూడు లేయర్లలో సీబీఐ సవాల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. మరి హైకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

