ఏపీ ప్రభుత్వం వైద్య సేవలలో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇస్తోంది. విజయవాడ , గుంటూరు సర్వజన ఆస్పత్రులలో స్పీచ్ టు టెక్ట్స్ విధానం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. చేతి రాతతో అవసరం లేకుండా ఈ విధానం పరీక్షిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ విధానం పరిశీలిస్తున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఓపీ, రోగుల వివరాలు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అన్నీ డిజిటల్ రూపంలోకి మారనున్నాయి.

సాధారణంగా రోగి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు తెలుసుకుంటారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటుగా వాటి ఫలితాల ఆధారంగా కొన్ని మందులను డాక్టర్లు సిఫార్సు చేస్తారు. అయితే ఇప్పటి వరకూ ఈ వివరాలన్నీ రాతపద్ధతిలో ఉండేవి. రికార్డులు కూడా ఉండేవి కావు. అలాగే ఏ డాక్టర్ వద్దకు ఎంతమంది రోగులొచ్చారనేదీ ఓపీ చీటీల ఆధారంగానే తెలుసుకోవాల్సి వచ్చేది. అయితే స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో అలా ఉండదు. ఉదాహరణకు రోగిని పరిశీలించిన తర్వాత డాక్టర్ ఎలాంటి ఔషధాలు వాడాలి, ఏయే పరీక్షలు చేయాలి అనే వివరాలను చెప్తే.. డాక్టర్ ముందున్న కంప్యూటర్, లేదా ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరంలో స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో అదంతా నమోదవుతుంది. ఆ తర్వాత ఆ వివరాలు మొత్తం ఆస్పత్రి డేటాబేస్‌లో నమోదవుతాయి.
గుంటూరు, విజయవాడ సర్వజన ఆస్పత్రులలో గత వారం రోజులుగా స్పీచ్ టు టెక్స్ట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. గుంటూరు ఆస్పత్రిలో 35కుపైగా విభాగాలున్నాయి. వైద్యుల కొరతతో పాటుగా సమయపాలన పాటించకపోవడం ఇతరత్రా సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఈ ఆలోచన చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొన్ని లోపాలను గుర్తించిన సౌరభ్ గౌర్.. రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అలాగే ఓపీకి క్యూఆర్ కోడ్, వైద్యుల పనితీరుపై హెచ్‌పీఆర్ కోడ్ కేటాయింపు అమల్లోకి తెచ్చారు. అలాగే స్పీ్చ్ టు టెక్ట్స్ విధానం ప్రారంభించారు.
మరోవైపు స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో నమోదు చేసిన తర్వాత.. ఆ వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో డాక్టర్ సరిచూసి ఓకే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్పత్రి డేటా బేస్‌లోకి వివరాలు చేరుతాయి. ఈ విధానంలో ఫైల్ ఓపీ నుంచి ఫార్మసీ కౌంటర్ వరకూ చెక్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపై అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.


