తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీలలో స్లాటెడ్ సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ తేదీలలో దర్శనాల కోసం మార్చి 1, 2వ తేదీలో టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి నాలుగో తేదీ నుంచి భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం కల్పిస్తామని.. ఇందుకోసం మార్చి మూడో తేదీన ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. అలాగే మార్చి 3న వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దుచేసినట్లు తెలిపింది.
హైలైట్:
- తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక
- మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం
- మార్చి 1, 2వ తేదీలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు

మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం.. మూతపడనున్న శ్రీవారి ఆలయం
మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల ఆలయాన్ని సుమారు 10.30 గంటలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం మార్చి మూడో తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుంది. అయితే గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉదయం తొమ్మిది గంటలకే తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
గ్రహణం విడిచిన తర్వాత సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి.. 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు.


