కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం లేదన్న ఆయన.. రాష్ట్రం పేరును ఎన్టీఆర్ కోరుకున్న విధంగా తెలుగు నాడు అని మార్చాలని సూచించారు. కేరళ వాళ్ల తరహాలోనే మనం కూడా పట్టుదలతో వ్యవహరించి రాష్ట్రం పేరును మార్చుకుంటే.. పేరు మాత్రమే కాకుండా మన బతుకులు కూడా మారతాయన్నారు.
హైలైట్:
- ప్రపంచ తెలుగు మహాసభల్లో గరికపాటి కొత్త డిమాండ్
- రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలన్న గరికపాటి
- ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పేరు కాదన్న ప్రవచనకర్త

మహర్షులు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు తప్పుకోవడం మనం ఒత్తిడిలో జీవిస్తున్నామని గరికపాటి వ్యాఖ్యానించారు. తల్లి కడుపులో నుంచి బయటకొచ్చింది మొదలు చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరూ ఆందోళనతోనే ఉంటున్నారన్నారని ఆయన తెలిపారు. ఆత్మసిద్ధి పొందడం కోసం ఒకటో తెలుగు వాచకంలోనే నాలుగు మాటలు పెట్టారన్నారు. ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే తెలుగు భాష బతుకుతుందన్నారు. తన ఇద్దరు పిల్లలను తాను తెలుగు మీడియంలోనే చదివించానని ఆయన చెప్పారు. తెలుగు మాధ్యమం వల్ల ఎవరూ నష్టపోలేదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదవాలని నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సొంత దేశంలోనే ఉండాలని, ఇక్కడే పని చేయాలని అనుకుంటే భారతదేశం ఐదేళ్లలోనే విశ్వగురువుగా మారుతుందన్నారు.
తెలుగు పేరు కోసం ఏన్టీఆర్ కృషి..
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఆంధ్ర అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుందని.. తెలుగు అనేది భాషాపరంగా అందర్నీ ఏకం చేస్తుందని ఆయన నమ్మారు. అందుకే రాష్ట్రం పేరు మార్చే విషయమై ఆయన అసెంబ్లీలో చర్చలు జరిపారు. కొందరు ఆయన ఆలోచనతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ఆంధ్ర అనే చారిత్రక పేరును మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన రాష్ట్రం పేరును మార్చలేకపోయారు. అయినప్పటికీ.. తెలుగు గంగ, తెలుగు గ్రామీణ పథం లాంటి పేర్లతో ఆయన తెలుగు పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.


