ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం కావటంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. అయితే విశాఖపట్నం, అల్లూరి జిల్లా రేషన్ కార్డుదారులకు మాత్రం ఈ నెలలో కందిపప్పుతో పాటుగా రాగులు పంపిణీ కూడా జరగడం లేదు. కందిపప్పు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోగా.. గత మూడు నెలలుగా పంపిణీ చేసిన రాగులు కూడా విశాఖ, అల్లూరి జిల్లావాసులకు ఈసారికి అందుబాటులో లేకుండా పోయాయి.

అవసరాలకు తగిన మొత్తంలో రాగులు సరఫరా కాలేదని సమాచారం. ముఖ్యంగా ఒడిశా నుంచి రావాల్సిన రాగులు రాలేదని.. దీంతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాలలో రాగుల పంపిణీ జరగనట్లు సమాచారం. మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలతో సహా రేషన్ షాపులు.. లబ్ధిదారులకు అందుబాటులో ఉండనున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ, అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
కందిపప్పు.. ఈసారి లేనట్లేనా..
మరోవైపు ఏపీలో రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నప్పటికీ.. కందిపప్పు సరఫరా మాత్రం జరగడం లేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీపై కందిపప్పు అందిస్తే మధ్యతరగతి జీవికి కాస్త ఊరటగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఏపీలో కందిపప్పు పంపిణీ నిలిచిపోయి సుమారుగా ఏడాది కావొస్తోంది.
బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నాణ్యత ఆధారంగా ధర రూ.110 నుంచి రూ.120 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు. రూ.67లకే అందించేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని జనం కోరుతున్నారు. అయితే పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్ని నెలలు పాటు కందిపప్పు సరఫరా చేశారు. ఆ తర్వాత కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది.


