అమరావతి, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో లీకేజీలకు పాల్పడకుండా, పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చింది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు హాజరయ్యే అధికారులు, ఇన్విజిలేటర్ల విషయంలో విద్యాశాఖ డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో కేటాయింపులు చేయనుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, అదనపు డిపార్టుమెంట్ అధికారులను నియమిస్తూ ఇప్పటికే నియామకం ఉత్తర్వులను వారి మెయిల్‌కు పంపారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో ఎవరికీ విధుల నుంచి మినహాయింపు ఉండబోదని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఇప్పటికే హుకూం జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకునేందుకు మండలానికి ఇద్దరు చొప్పున రిజర్వులో ఉంచారు.
అయితే ఆటోమేషన్ విధానంలో నియామకాలు ఉండటం వల్ల కొందరు HMలు, స్కూలు అసిస్టెంట్లకు సుదూర ప్రాంతాల్లో విధులు కేటాయించారు. పొదిలిలోని ఉప్పలపాడు హైస్కూలులో పనిచేస్తున్న వారిని ఏకంగా 100 కిలోమీటర్లు దూరంలోని గిద్దలూరులో నియమించారు. ఇలా అనేక మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంతో తలలు పట్టుకుంటున్నారు. అయితే వీరి విధుల కేటాయింపు విషయంలో మార్పులు చేసేందుకు డీఈవోలకు అధికారం ఉంటుంది. దీంతో వారంతా డీఈవోలను కలిసి సర్దుబాటుకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. కొందరు ఉపాధ్యాయులకు మాత్రం పరీక్ష విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందుకు తొలుత 7 మినహాయింపులు ఇచ్చిన విద్యాశాఖ.. ఆ తర్వాత వాటిని 15కి పెంచారు. ఈ మినహాయింపులు పొందేందుకు ఎవరు అర్హులంటే..
ఇవి కూడా చదవండి
ఏపీ పదో తరగతి పరీక్షల 2026 విధుల నుంచి వీరికి మినహాయింపు..
- పాలు ఇస్తున్న తల్లులు, గతంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారు, ప్రైవేటుగా ట్యూషన్లు చెబుతున్నవారు, 10వ తరగతికి హాజరవుతున్న పిల్లలు ఉన్న వారు, సస్పెన్షన్‌లో ఉన్న వారు, గర్భిణీలకు విధుల నుంచి మినహాయింపు ఉంటుంది.
- గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న వారిని కూడా విధులకు దూరంగా ఉంచనున్నారు.
- అలాగే క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు, ఓపెన్ హార్ట్ సర్జరీ, స్టంట్, అవయవ మార్పిడి, మేజర్ న్యూరోసర్జరీ హిస్టరీ ఉన్నవారు, టీబీ, కిడ్నీ మార్పిడి, వెన్నెముక సర్జరీ చేయించుకున్న వారికి, స్పౌజ్ మానసిక వైకల్యం ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది.
- 75 శాతం వైకల్యంతో జువెనల్ డయాబెటిస్, హీమోపీలియో వంటి అంగవైకల్యం పిల్లలు ఉన్న వారు, 70 నుంచి 90 శాతం వినికిడిలోపం ఉన్నవారిని పరీక్షల విధుల నుంచి మినహాయిస్తారు.
- ఇందులో మినహాయింపు పరిధిలోకి వచ్చేవారిని పొరపాటున విధులకు నియమిస్తే అలాంటి వారు తగిన ఆధారాలతో సంబంధిత డీఈవోను కలిసి పరీక్షల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చని విద్యాశాఖ పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

