తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోన క్యూలైన్‌లో భక్తుల మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరు భక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు భక్తులు ఘర్షణ పడ్డారని.. టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారని టీటీడీ పేర్కొంది. భక్తులు ఓపికతో వ్యవహరించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించింది.

” తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణతేజ అతిథి భవనం సమీపంలో ఉన్న క్యూలైన్లలో ఇద్దరు భక్తులు సోమవారం ఘర్షణ పడ్డారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇద్దరి మధ్య ఘర్షణను నిలువరించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విధంగా ఘర్షణకు దిగడం సమంజసం కాదు. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలి. క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి శ్రీవారిని దర్శించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.” అంటూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించారు. సోమవారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. తెప్పోత్సవాలలో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీదేవీ, భూదేవీసమేత మలయప్పస్వామి తెప్పపై విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులకు కనువిందు చేశారు.
వేదపండితుల వేదపారాయణం, మంగళవాయిద్యాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య శ్రీవారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.


