ప్రస్తుత కాలంలో ఒక సినిమా థియేటర్లలో నెల రోజులు ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. స్టార్ హీరోల చిత్రాలు సైతం మూడు నాలుగు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. మన దేశంలో ఒకసారి సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిందంటే, వెండితెరపై దాని ప్రస్థానం ముగిసినట్లే లెక్క. కానీ, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఆ దృశ్యకావ్యం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓటీటీలో అందుబాటులో ఉన్నా, విదేశీయులు థియేటర్ల వద్ద క్యూ కట్టారంటే ఆ మేజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒక సినిమా విడుదలయ్యాక ఇండియాలో నాలుగు వారాలు ఆడితే అది గొప్ప విజయం. కానీ ఒక తెలుగు సినిమా ఏకంగా ఏడాదికి పైగా విదేశీ గడ్డపై ఆడుతూనే ఉందంటే అది ఎవరికైనా ఆశ్చర్యమే. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా అక్కడి ప్రేక్షకులు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మళ్లీ మళ్లీ చూశారు. ఒక నాన్-ఇంగ్లీష్ సినిమాకు అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ఈ స్థాయి ఆదరణ దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆస్కార్ అవార్డుతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ సినిమా మరేదో కాదు.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిభకు నిదర్శనమైన ‘ఆర్ఆర్ఆర్’ (RRR).
అమెరికాలో అరుదైన రికార్డు..
సాధారణంగా అమెరికాలో ఇండియన్ సినిమాలకు మొదటి వీకెండ్ లోనే ఎక్కువ వసూళ్లు వస్తాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అక్కడి లెక్కలన్నీ మారిపోయాయి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఈ సినిమా అక్కడ ప్రదర్శితమైంది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జనం థియేటర్లకు రావడం చూసి స్థానిక డిస్ట్రిబ్యూటర్లే షాక్ అయ్యారు. ఒక సర్వే ప్రకారం, అమెరికాలోని ఇండియన్ ప్రేక్షకుల్లో చాలా మంది ఈ సినిమాను నాలుగు ఐదు సార్లు థియేటర్ లో చూశారట. హాలీవుడ్ సినిమాలకు సైతం దక్కని ఆదరణ మన సినిమాకు దక్కడం విశేషం.
జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ..
జపాన్‌లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు రెండు ఏళ్ల పాటు అక్కడ నిరంతరాయంగా స్క్రీనింగ్ అయింది. జపనీస్ ప్రేక్షకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. వారు ఆ గెటప్‌లు వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి భారీ వసూళ్లు రాబట్టింది. గతంలో రజనీకాంత్ కు మాత్రమే అక్కడ ఈ స్థాయిలో క్రేజ్ ఉండేది, ఇప్పుడు చరణ్, తారక్, ప్రభాస్ ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అభిమానం ఎంతలా పెరిగిందంటే, అక్కడి వారు మన దేశానికి వచ్చి మరీ తమ హీరోలను కలుస్తున్నారు.
ఆస్కార్ మ్యాజిక్..
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో పాటు గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ పురస్కారాలు దక్కడం సినిమాకు భారీ మైలేజీని ఇచ్చింది. గ్లోబల్ స్థాయిలో జరిగిన ప్రమోషన్ల వల్ల విదేశీయులు ఈ సినిమాను ఒక సెలబ్రేషన్ లా ఫీల్ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది టాప్ వ్యూస్ సాధించినప్పటికీ, పెద్ద తెరపై ఆ విజువల్స్ చూడటానికే అక్కడి వారు ఇష్టపడ్డారు. మన దేశంలో కంటే విదేశాల్లోనే ఈ సినిమాను ఎక్కువ మంది చూశారని సర్వేలు చెబుతున్నాయి. రాజమౌళి సృష్టించిన ఈ వండర్ ఇప్పట్లో మరే సినిమా బీట్ చేసే అవకాశం కనిపించడం లేదు. భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పటికీ ఒక మైలురాయిలా నిలిచిపోతుంది.

