సాధారణంగా గ్రహణం వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ మూతపడతాయి. గ్రహణ సమయానికి కనీసం 6 గంటల ముందే ద్వారాలు మూసివేసి, గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా, గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతోంది చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడినా, శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం భక్తుల కోసం యథావిధిగా తెరిచే ఉంటుంది. రాహు-కేతు క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో గ్రహణ ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణ కాలంలోనూ ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు, అభిషేకాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
ప్రత్యేక గ్రహణకాల శాంతి అభిషేకాలు
మంగళవారం చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. గ్రహణ కాల సమయంలోనే స్వామి, అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. గ్రహణ సమయంలో ముక్కంటిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ సమయంలో భక్తులు భారీగా ఆలయానికి పోటెత్తుతారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
గ్రహణ కాలంలో రాహు-కేతు దోష నివారణ పూజలు చేసుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోకమంతా గ్రహణ నియమాలను పాటిస్తూ ఇళ్లకే పరిమితమైనా.. శ్రీకాళహస్తిలో మాత్రం భక్తి పారవశ్యం వెల్లివిరుస్తోంది. గ్రహణ సమయంలోనూ ముక్కంటి దర్శనం కల్పించడం శ్రీకాళహస్తి క్షేత్రానికే దక్కిన అరుదైన గౌరవం. గ్రహణ గండాలను హరించే ఆ పరమశివుని చెంత భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు.

