ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఒకే వ్యక్తికి మూడు పోస్టులు అప్పగించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో రిజిస్ట్రార్ అదనపు బాధ్యతలు మార్కెట్ విలువ రిజిస్ట్రార్‌గా ఉన్న శ్రీనివాసులకు అప్పగించారు. దీంతో ఒకే వ్యక్తి మూడు పోస్టులను నిర్వహించడం సాధ్యమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆయా జిల్లాలకు రిజిస్ట్రార్లను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అసలు ఎందుకీ పరిస్థితి..
2018 గ్రూప్ 1లో ఎంపికైన అధికారులను ముఖ్యమైన పోస్టుల నుంచి తప్పించాలని ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిని ఇతర కార్యాలయాలకు అటాచ్ చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న భార్గవ్‌ను.. విజయవాడలోని ఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. అలాగే అనారోగ్య కారణాలతో శ్రీసత్యసాయి జిల్లా రిజిస్ట్రార్ కృష్ణకుమారి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల రిజిస్ట్రార్ పోస్టులకు ప్రభుత్వం అధికారులను నియమించలేదు. ఈ బాధ్యతలను మార్కెట్ విలువల రిజిస్ట్రార్ శ్రీనివాసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ రిజిస్ట్రార్లు లేక.. అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో కలిపి 21 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రెగ్యులర్ రిజిస్ట్రార్లు లేకపోవటంతో ఈ కార్యాలయాలలోని పాలనపరమైన ఇబ్బందులు, ఫిర్యాదులకు సంబంధించి ఒక్కరే అధికారి పనులు చక్కబెట్టాలంటే సాధ్యమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి . ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు రెగ్యులర్ రిజిస్ట్రార్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు 2018 గ్రూప్ -1 నియామక ప్రక్రియలో లోపాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై విచారణ పూర్తయ్యే వరకూ.. 2018 గ్రూప్ 1లో ఎంపికైన అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోనే ఉంచాలని ఏపీ హైకోర్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కీలక పోస్టుల్లోని అధికారులను బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 26 మంది ఆర్డీవోలను ఏపీ ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేసింది.


