Nadendla Bhaskara Rao Fake Posts Issue: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరుతో ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ మేరకు జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాదెండ్ల పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేతలు పోలీసుల్ని కోరారు. నాదెండ్ల పేరుతో అసలు సోషల్ మీడియా అకౌంట్లు లేవని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.
హైలైట్:
- మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరుతో ఫేక్ పోస్ట్
- పోలీసులకు జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు
- మంత్రి నాదెండ్ల మనోహర్ ఫేక్ పోస్టుపై స్పందించారు

నాదెండ్ల భాస్కరరావు పేరుతో పోస్టులు పెట్టిన అకౌంట్ ఫేక్ అని.. దానిని సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. వయోభారంతో నాదెండ్ల భాస్కరరావు సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా లేరని.. పోస్టులు పెట్టడం కూడా ఆయనకు తెలియదన్నారు. అయినా సరే ఆయన పేరుతో పోస్టులు పెట్టడం దారుణమన్నారు. జనసేన నేతల ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని.. త్వరలో ఈ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ల వెనకున్న వారిని కనిపెడతామని పోలీసులు తెలిపారు. తన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పేరుతో జరుగుతున్న ప్రచారంపై కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాతో తప్పుడు చేయడం దారుణమన్నారు. తాత్కాలికంగా అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేయాలనుకున్నా.. ఎక్కువ కాలం ఇవన్నీ దాగవు అన్నారు. ఈ వివాదంలోకి కొందరు మహిళల్ని లాగారని.. చివరికి తన తండ్రి పేరుతో ఫేక్ అకౌంట్‌తో అబద్ధాలను వివాదాస్పద పోస్టులతో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే వారు ఎంత బరితెగించారో అర్ధమవుతుందన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా, సాంకేతికత విషయంలో ప్రజలు ఎంతో అప్డేట్ అయ్యారని.. ఏది నిజమో, ఏది ఫేక్ తెలుసుకోగలిగే పరిస్థితిలో ఉన్నారన్నారు మంత్రి మనోహర్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేద్దామనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తన తండ్రి నాదెండ్ల భాస్కరారావు వయస్సుకు గౌరవం ఇవ్వకుండా.. ఇలా ఫేక్ అకౌంట్‌ను సృష్టించడం దారుణమన్నారు. ఇవీన్న చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఎంతటి తప్పుడు ప్రచారాలు చేసేందుకైనా వెనకాడరన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని.. ఇలా ఈ ఫేక్ అకౌంట్లు, ఫేక్ వీడియోలతో విష ప్రచారం చేసేవారిని వదిలే ప్రసక్తిలేదు’ అని మంత్రి మనోహర్ హెచ్చరించారు.


