హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఆరు ఫైర్ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 10 ఫర్నీచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 20 షాపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కో ఫర్నీచర్ షాపులో సుమారు 25 నుంచి 30 లక్షల విలువైన ఫర్నిచర్ నిల్వ ఉన్నట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. దీంతో కోట్లలో ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 ఫర్నీచర్ షాపులకు మంటలు అంటుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు..
మంగళవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ షాపులో షార్టు సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా తెలిసింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు పక్కనున్న ఇతర షాపులకు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉంటున్న కొందరు వ్యాపారులు ఇక్కడే నివాసం ఉంటున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఇళ్లలోని వంట గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడంతో మంటల తీవ్రత మరింతగా పెరిగిందని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం భారీగా జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Massive fire in Bachupally gutted a furniture store near Vignan VNR College under Nizampet Circle limits.
Firefighters rushed with multiple engines. No casualties reported. Further details awaited. pic.twitter.com/VSrkerhxfn
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) March 3, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

