ఏపీలో ప్రస్తుతం స్త్రీశక్తి పథకం అమలుతో రాష్ట్రంలోని మహిళలందరికీ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలవుతోండగా.. లక్షలాది మంది మహిళలు రోజూ లబ్ది పొందుతున్నారు. అయితే ఈ పథకాన్ని మరింత విస్తరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల కేబినెట్‌లో దీనికి కేబినెట్ ఆమోదముద్ర వేశారు. ఇంద్రధనస్సు అనేక పథకం ద్వారా దివ్యాంగులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించనున్నారు. ఇటీవల ఈ స్కీమ్ అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయగా.. ఎప్పటినుంచి అమలవుతుందనే దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.
మార్చి 18 నుంచి ప్రారంభం
మార్చి 18 నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రోజున సీఎం చంద్రబాబు ఇంద్రధనస్సు పథకాన్ని స్వయంగా ప్రారంభిస్తారని తెలిపింది. దీంతో ఆ రోజు నుంచి దివ్యాంగులు ఇక ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని సూచించింది. అలాగే ఏయే బస్సుల్లో ప్రయాణించవచ్చనే వివరాలు కూడా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రకటన విడుదల చేసింది. అలాగే దివ్యాంగుల సహాయకుడిని కూడా టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ తెలిపారు. 40 శాతం లేదా ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు కేవలం 50 శాతం రాయితీ మాత్రమే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు టికెట్లపై కల్పించేవారు. ఇప్పుడు 100 శాతం రాయితీ కల్పించి ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు.
తెలంగాణలో లేనట్లే..
అటు ఏపీలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోండగా.. దివ్యాంగులకు 50 శాతం రాయితీ అందిస్తున్నాయి. అయితే ఏపీలో దివ్యాంగులకు ఫ్రీ బస్సు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరిగింది. మార్చి 20వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై టీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అలాంటి నిర్ణయం ఎలాంటిది తీసుకోలేదని, బయట జరుగుతున్న ప్రచారం అవాస్తమవని తెలిపింది. అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని పేర్కొంది.

