భారతదేశం నుంచి వచ్చే ఫుట్‌బాల్ తారలను గుర్తించేందుకు టీవీ9 నెట్‌వర్క్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ జాతీయ ట్రయల్స్ అస్సాంలోని డిబ్రుగఢ్ ఖానికర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సాగిన విస్తృత స్థాయి ఎంపిక ప్రక్రియకు ఇది తుది దశ కావడంతో చిన్నారుల్లో అపార ఉత్సాహం కనిపించింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మొదటి దశల్లోనే 38 వేలకుపైగా పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక దశల్లో జరిగిన ఎంపికలు, ప్రాంతీయ ట్రయల్స్ అనంతరం ప్రస్తుతం సుమారు 300 మంది యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయి తుది ట్రయల్స్‌కు ఎంపికయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ట్రయల్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులు మాత్రమే చివరికి ఎంపికవుతారు.

ఎంపికైన ఆ 25 మంది యువకులు జర్మనీకి వెళ్లి అక్కడి అత్యాధునిక ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం దక్కించుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభను చాటే ఈ కార్యక్రమం యువ క్రీడాకారులకు అరుదైన వేదికగా మారుతోంది. డిబ్రుగఢ్‌లో జరుగుతున్న ఈ ట్రయల్స్‌కు అస్సాం ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కార్యాలయం ప్రోత్సాహం ఇవ్వగా, అస్సాం క్రీడా శాఖ, క్రీడా ప్రాధికార సంస్థలు నిర్వహణకు సహకరించాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఫుట్‌బాల్ సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి భాగస్వామ్యంగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల క్రీడా సంస్థలతో పాటు లడఖ్ ఫుట్‌బాల్ సంఘం కూడా సహకారం అందించింది. మొదటి రోజు ట్రయల్స్‌లో ఆటగాళ్లకు కఠిన పరీక్షలు నిర్వహించారు. ఫిట్‌నెస్ అంచనాలు, సాంకేతిక నైపుణ్యాల పరీక్షలు, ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ కోచ్‌లు ఆటగాళ్ల ప్రతిభను సమగ్రంగా పరిశీలించారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి డిబ్రుగఢ్ జిల్లా కలెక్టర్ బిక్రమ్ కైరీ, సీఆర్‌పీఎఫ్ డీఐజీ (ఆపరేషన్స్) ప్రభాకర్ త్రిపాఠి, జిల్లా క్రీడా అధికారి సామి సైకా హాజరయ్యారు. యువ క్రీడాకారులకు సరైన అవకాశాలు కల్పించడం భారత క్రీడా భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు.

అనుభవజ్ఞులైన కోచింగ్ బృందం పర్యవేక్షణలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రధాన కోచ్ కర్మ మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియ అత్యంత పోటీతో కూడుకున్నదని, సాంకేతిక నైపుణ్యంతో పాటు మానసిక ధైర్యం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనిధి విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాయోజకుడిగా సమర్పిస్తుండగా, రామయ్య విశ్వవిద్యాలయం సహ ప్రాయోజకుడిగా మద్దతు ఇస్తోంది. యువ ఫుట్‌బాల్ ప్రతిభకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఇక ఈ ప్రతిభ వేటకు దేశ నాయకత్వం నుంచి కూడా ప్రోత్సాహం లభించింది. తొలి సీజన్‌లో ఎంపికైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు గత ఏడాది ఢిల్లీలో జరిగిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే 2025’ గ్లోబల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆ యువ క్రీడాకారులను కేంద్ర క్రీడామంత్రి మన్‌సుఖ్ మాండవియా, భారతదేశంలోని ఆస్ట్రియా రాయబారి కతరీనా వైజర్ సత్కరించారు. డిబ్రుగఢ్‌లో ప్రారంభమైన ఈ జాతీయ ట్రయల్స్‌తో భారత ఫుట్‌బాల్ భవిష్యత్తుకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయని నిర్వాహకులు భావిస్తున్నారు. వచ్చే రెండు రోజులు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఎందుకంటే, ఈ ట్రయల్స్ ముగిసే సరికి జర్మనీకి వెళ్లే 25 మంది భారత యువ ఫుట్‌బాల్ తారలు ఎవరో తేలిపోనుంది.
ఈ టాలెంట్ హంట్ సాంగ్ దిగువన చూడండి…

