వైసీపీ ప్రభుత్వం రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. రాష్ట్రాన్ని వాటి నుంచి బయటపడేసేందుకు ఓవైపు ప్రయత్నిస్తూ, మరోవైపు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. పింఛన్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఆర్ధిక విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం ఇలా ప్రతి అడుగులో వైసీపీ చేసిన విధ్వంసం, దాని వలన జరిగిన నష్టం.. ప్రతి అంశం లెక్కలతో సహా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. అందులో కాంట్రాక్టర్లు, వెండర్లకు చెల్లించాల్సిన అప్పులే 1.35 లక్షల కోట్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 25 వేల కోట్లు అప్పులు చెల్లించామని వెల్లడించారు.
శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో రూ. 37 వేల కోట్లు విడుదల చేశామని.. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకి రూ. 18,700 కోట్లు విడుదల చేసినట్టు పవన్ కళ్యా్ణ్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన రూ.10,500 కోట్ల నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందన్న పవన్ కళ్యాణ్.. కేంద్ర పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. ఫలితంగా రూ. 8,700 కోట్లు నిరుపయోగమయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్లిన పులివెందుల, డోన్, ఉద్దానం ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కేటాయించామని.. మల్టీ విలేజ్ స్కీం ప్రాజెక్టులను ఈ వేసవిలోనే అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. రూ. 7,910 కోట్లతో 5 జిల్లాలలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రారంభించామని.. జల్ జీవన్ మిషన్ ద్వారా మూడు వేల గ్రామాలలో నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
వైసీపీ ప్రభుత్వంలో సీసీ, బీటీ రోడ్ల కోసం రూ. 641 కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి 20 నెలల కాలంలోనే రూ. 3853 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో 854 కి.మీ సీసీ రోడ్లు, 239 కి.మీ బీటీ రోడ్లు వేస్తే.. తమ ప్రభుత్వం 6000 కి.మీ సీసీ రోడ్లు, 1331 కి.మీ మేరకు బీటీ రోడ్లు నిర్మించినట్టు వివరించారు.
గ్రామీణాభివృద్ధి కోసం వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 4610 కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే రూ. 11,506 కోట్లు ఖర్చు చేసినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతకు ఈ లెక్కలే నిదర్శనమంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలంతా ఐక్యంగా ముందుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని అన్నారు.


