మార్చి నెల ప్రారంభంలోనే నడినెత్తిన సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలుస్తోంది. మే నెలలో ఎల్‍నినో ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు ECMWF అంచనా వేసింది. ఆగస్ట్ నాటికి బలపడే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు భానుడి ప్రతాపం ఇప్పటికే మొదలైపోయింది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భారత వాతావరణ విభాగం ఇప్పటికే పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించింది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండాలని సూచించింది.
మరోవైపు మే నెలలో ఎల్‌నినో ఏర్పడుతుందని.. ఆగస్ట్ నాటికి బలపడుతుందని ECMWF ( European Centre for Medium Range Weather Forecasts) అంచనా వేసింది. ఆగస్ట్ నెలలో సూపర్ ఎల్‌నినో ఏర్పడే అవకాశం 22 శాతం ఉందని.. స్ట్రాంగ్ ఎల్‌నినో ఏర్పడటానికి 80 శాతం, మోస్తరు ఎల్‌నినో ఏర్పడేందుకు 98 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అటు మార్చి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అంచనా వేసింది.
ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరతాయని.. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచేందుకు ఛాన్స్ ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఎండలు. వడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.


