
Sanju Samson : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అందరి కళ్లూ ఒకే ఒక్కడిపై నిలిచాయి.. ఆయనే కేరళ కుట్టి సంజూ శాంసన్. ఈ టోర్నీ ఆరంభంలో అసలు జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న విమర్శలు ఎదుర్కొన్న సంజూ, చివరకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ముద్దాడి విమర్శకుల నోళ్లు మూయించాడు. 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ ప్రపంచ విజేతగా నిలవడంలో సంజూ పాత్ర అమోఘం. ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత సంజూ తన భార్య చారులతకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక అత్యంత భావోద్వేగమైన సందేశాన్ని రాసుకొచ్చాడు.
తమ ఇద్దరి ఫోటోను షేర్ చేస్తూ సంజూ ఇలా రాశాడు.. “మనం కలిసిన మొదటి రోజు నుంచి నేటి వరకు.. నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. బయటి ప్రపంచానికి నేను ఎలా కనిపించినా, నాలోని మంచినీ, చెడునీ చూసి కూడా నన్ను నన్నుగా ప్రేమించిన వ్యక్తివి నువ్వు. నా జీవితంలో క్రికెట్ ఎంత ముఖ్యమో నీకు తెలుసు.. దానికి నువ్వు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చావు. ఈ ప్రపంచ కప్ విజయం కోసం నేను ఎంతగా తపించానో, నీ మనసులో కూడా అంతే ఆకాంక్ష ఉంది. నీ ప్రేమ, నిజాయితీకి ధన్యవాదాలు మై డియర్ వైఫ్” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పర్ఫెక్ట్ కపుల్ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
ప్రపంచ విజేతగా నిలిచిన సంజూ శాంసన్‌కు తన సొంత రాష్ట్రం కేరళ నుంచి అదిరిపోయే గౌరవం దక్కబోతోంది. కేరళ క్రీడాశాఖ మంత్రి వి.శివన్ కుట్టి మాట్లాడుతూ.. సంజూ కేరళ గడ్డపై అడుగుపెట్టగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించనున్నట్లు ప్రకటించారు. కేరళలో ఒక భారీ ఈవెంట్ నిర్వహించి అతనికి మర్చిపోలేని బహుమతిని అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోలు కూడా సంజూను అభినందిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
View this post on Instagram
నిజానికి సంజూ శాంసన్ ప్రస్థానం ఈ టోర్నీలో ఒక సినిమాను తలపిస్తుంది. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో అతనికి అసలు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటే దక్కలేదు. కానీ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సంజూకు అవకాశం రాగా, దానిని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్, న్యూజిలాండ్‌తో ఫైనల్.. ఇలా వరుసగా మూడు కీలక మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 80కి పైగా సగటుతో 321 పరుగులు సాధించాడు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, అతని స్ట్రైక్ రేట్ దాదాపు 200కి సమీపంలో ఉండటం. ఒక రకంగా చెప్పాలంటే, సంజూ శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్ కివీస్ బౌలర్ల వెన్నువిరిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

