ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ సంస్థకు విశాఖపట్నంలోని వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఓ కస్టమర్ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్ సర్వీసులో లోపంతో పాటుగా కస్టమర్ మానసిక వేదనకు గురయ్యేలా చేశారంటూ ఓలా సంస్థకు రూ.20 వేలు జరిమానా విధించింది. అతని ఎలక్ట్రిక్ స్కూటర్లోని లోపాలను ఉచితంగా సరిచేయాలని ఆదేశించింది.చట్టపరమైన ఖర్చుల కింద మరో పదివేలు ఇవ్వాలని ఆదేశించింది.

ఫిర్యాదుదారు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతానికి చెందిన వై. భరత్ కుమార్ అనే వ్యక్తి.. 2024 ఏప్రిల్ నెలలో ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా చెల్లించారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత స్కూటర్లో సమస్యలు మొదలయ్యాయి. స్టార్టింగ్ ప్రాబ్లమ్, సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తాయి. దీనిపై పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, సర్వీస్ అభ్యర్థనలు పెట్టినప్పటికీ ప్రయోజనం లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్లో సమస్యలు అలాగే కొనసాగాయి.
దీంతో విసుగెత్తిపోయిన భరత్ కుమార్.. వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. వాహనాన్ని రీప్లేస్ చేయటం లేదా పూర్తి రీఫండ్ చెల్లించాలని ఆదేశించాలంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటుగా సర్వీసులో లోపం నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కస్టమర్ లేవనెత్తిన సమస్యలను తమ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వెంటనే పరిష్కరించిందని, తనిఖీలతో పాటుగా సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రొసీజర్ ప్రకారం నిర్వహించామని ఓలా సంస్థ కౌంటర్ దాఖలు చేసింది. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎలాంటి తయారీ లోపాలు లేవని వాదించింది. రీప్లేస్మెంట్ లేదా ఫుల్ రీఫండ్ డిమాండ్ అన్యాయమని కంపెనీ పేర్కొంది.
అయితే ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల కమిషన్.. వినియోగదారుడు పదే పదే అభ్యర్థించినప్పటికీ కంపెనీ చర్యలు తీసుకోకపోవటం, లోపాలను సరిదిద్దడానికి ఇష్టపడకపోవడం సేవా లోపంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఇలాంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులు ఫిర్యాదుదారునికి మానసిక వేదన కలిగించాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ సంస్థకు 20 వేలు జరిమానా విధించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లో లోపాలను ఉచితంగా సరిదిద్దాలని, స్కూటర్ సజావుగా నడపడానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించింది. అలాగే అవసరమైతే పనిచేయని సాఫ్ట్వేర్ భాగాలను భర్తీ చేయాలని ఓలా ఎలక్ట్రిక్‌ను ఆదేశించింది.


