
మార్చి మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు మండిపోతుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వాతావరణం వేడిగానూ, తేమగానూ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో వేసవి వేడి నుంచి తప్పించుకోవడానికి ఏసీలు, కూలర్లకు గిరాకీ పెరిగింది. అయితే ఆరోగ్యం విషయంలో ఏసీ మంచిదా? కూలర్ మంచిదా? అనే చర్చ మళ్లీ మొదలైంది.
ఏసీ చల్లదనం వెనుక దాగున్న ముప్పు
ఏసీ గది ఉష్ణోగ్రతను త్వరగా తగ్గిస్తుంది కానీ దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏసీ గాలిలో తేమను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా పొడిబారిపోతుంది. గాలిలో తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం కలుగుతుంది. నిద్రలో ఉన్నప్పుడు ఈ విషయం మనకు తెలియదు. చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. గొంతు ఎండిపోవడం, ముక్కు దిబ్బడ మరియు సైనసైటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏసీ ఆన్ చేసినప్పుడు గదిని పూర్తిగా మూసివేయడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంది. ఏసీ వాడేటప్పుడు ఉష్ణోగ్రతను 21°C నుండి 24°C మధ్య ఉంచడం ఆరోగ్యానికి మంచిది.
ఎయిర్ కూలర్ – సహజ కూలింగ్
ఏసీతో పోలిస్తే ఎయిర్ కూలర్ ఆరోగ్యానికి కొంత మెరుగైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. ఇది నీటిని ఆవిరిగా మార్చడం ద్వారా గాలిని చల్లబరుస్తుంది. ఇది సహజమైన ప్రక్రియ. గాలిలో తేమను పెంచుతుంది కాబట్టి ఏసీ లాగా చర్మం పొడిబారదు. కూలర్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆస్తమా ఉన్నవారు కూలర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఏది ఎప్పుడు వాడాలి?
ఎండలు ఎక్కువగా ఉండి, గాలిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు కూలర్లు అద్భుతంగా పనిచేస్తాయి. గాలిలో ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీలు ఉపశమనాన్ని ఇస్తాయి. అంతిమంగా ఏసీల కంటే కూలర్లు సురక్షితమైనవని చెప్పవచ్చు. అయితే దేనినైనా పరిమితికి మించి వాడటం ఆరోగ్యానికి చేటు. సరైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడం, కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వేసవిని ఆరోగ్యంగా గడపవచ్చు.

