Kovvur To Jeelugumilli national Highway Rs 368 Crores Sanctioned: ఏపీలో మరో నేషనల్ హైవేకు కేంద్రం నుంచి నిదులు మంజూరయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ విషయాన్ని తెలియజేశారు. కొవ్వూరు టు జీలుగుమిల్లి హైవేకు కేంద్రం రూ.386 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ హైవేతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. పోలవరం ప్రాజెక్టుకు కనెక్టివిటీ పెరగుతుందన్నారు. ఏజెన్సీ గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పురందేశ్వరి తెలిపారు.
హైలైట్:
- ఏపీలో మరో నేషనల్ హైవేకు నిధులు
- కొవ్వూరు టు జీలుగుమిల్లికి హైవే ఫిక్స్
- కేంద్రం నుంచి రూ.368 కోట్లు మంజూరు

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయం తరలింపుపై ఎంపీ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని.. అలాగే క్షేత్రస్థాయికి కార్యాలయం దగ్గరగా ఉంటే ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుందన్నారు. మెరుగైన సమన్వయానికి అవకాశం ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, స్థానిక విభాగాలతో సమన్వయం వేగవంతం అవుతుంది అన్నారు. బాధితులకు దగ్గరగా ఉండొచ్చని.. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలు, నిర్వాసితులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది అన్నారు.


