
ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే చాలామంది ఫ్రిజ్‌ను వంటగదిలో అమర్చేటప్పుడు చేసే ఒక చిన్న తప్పు.. నెలకు వందల రూపాయల అదనపు విద్యుత్ బిల్లుకు కారణమవుతుందని మీకు తెలుసా? అవును.. ఫ్రిజ్‌ను గోడకు అతుక్కుపోయేలా ఆనించి ఉంచడం వల్ల కేవలం కరెంట్ బిల్లు పెరగడమే కాకుండా ఆ యంత్రం జీవితకాలం కూడా సగానికి పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది?
రిఫ్రిజిరేటర్ వెనుక భాగంలో కంప్రెసర్, కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. ఫ్రిజ్ లోపల చల్లదనాన్ని నింపే క్రమంలో ఇవి భారీగా వేడిని విడుదల చేస్తాయి. ఒకవేళ ఫ్రిజ్‌కు, గోడకు మధ్య తగినంత ఖాళీ స్థలం లేకపోతే ఆ వేడి బయటకు పోవడానికి మార్గం ఉండదు. దీనివల్ల కంప్రెసర్ మరింత వేడెక్కి, లోపల చల్లదనాన్ని కాపాడటానికి రెట్టింపు శక్తితో పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది.
ఎంత దూరం ఉంచాలి?
శాస్త్రీయ నిబంధనల ప్రకారం.. ఫ్రిజ్ వెనుక ప్యానెల్, గోడ మధ్య కనీసం 5 సెంటీమీటర్ల నుండి 10 సెంటీమీటర్ల దూరం ఖచ్చితంగా ఉండాలి. ఈ గాలి వెలుతురు వల్ల కంప్రెసర్ విడుదల చేసే వేడి సులభంగా బయటకు వెళ్లిపోతుంది.
గోడకు ఆనించి ఉంచడం వల్ల కలిగే నష్టాలు..
కరెంట్ బిల్లు పెరుగుదల: కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లులో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది.
తగ్గిన కూలింగ్: వేడి సరిగ్గా బయటకు పోకపోతే, ఫ్రిజ్ లోపల వస్తువులు త్వరగా చల్లబడవు.
త్వరగా పాడైపోవడం: నిరంతరం వేడెక్కడం వల్ల కంప్రెసర్ కాయిల్స్ దెబ్బతిని, ఫ్రిజ్ జీవితకాలం తగ్గిపోతుంది. మరమ్మతు ఖర్చులు తడిసి మోపెడవుతాయి.
మీ ఫ్రిజ్ క్షేమంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
సరైన దూరం: ఇప్పుడే మీ ఫ్రిజ్ గోడకు ఎంత దూరంలో ఉందో చెక్ చేయండి. కనీసం 5 సెం.మీ. దూరం ఉండేలా సర్దుబాటు చేయండి.
శుభ్రత: ఫ్రిజ్ వెనుక భాగంలో పేరుకుపోయే దుమ్ము, ధూళిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. దుమ్ము వల్ల వేడి బయటకు పోవడం కష్టమవుతుంది.
మాన్యువల్ చూడండి: ఫ్రిజ్ కొన్నప్పుడు ఇచ్చిన యూజర్ మాన్యువల్‌లో ఇన్‌స్టాలేషన్ సూచనలను ఒకసారి చదవండి.
మనం చేసే చిన్నపాటి మార్పులు మన జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి. ఫ్రిజ్‌ను గోడ నుండి కాస్త దూరంగా జరిపి ఉంచండి.. విద్యుత్తును ఆదా చేయండి..

