
రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ రాగి జావ తాగాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు.. వాస్తవానికి రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ ఆహారం. దీనిని రోజుకొకసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లదనం లభించడంతో పాటు ఆరోగ్యపరంగా అనేక లాభాలు చేకూరుతాయి. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు చాలా తక్కువగా ఉండటం, ముఖ్యంగా అసంతృప్త కొవ్వును కలిగి ఉండటం వల్ల ఇది చాలా సులభంగా జీర్ణమైపోతుంది. అంతేకాకుండా.. ఇది ఎముకలను బలోపేతం చేసి, తక్షణ శక్తిని అందిస్తుంది.
రాగి జావ ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు నియంత్రణ: రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉండటం వల్ల ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా, అధిక ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించి, బరువును నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాగి జావ లేదా సంగటి మంచి ప్రయోజనం అందిస్తుంది.
ఎముకల దృఢత్వం: రాగులలో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు కూడా ఇందులో ఉండే క్యాల్షియం తోడ్పడుతుంది.
రక్తహీనత నివారణ: రాగులలో ఐరన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు దీనిని తరచూ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: రాగి పిండిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: రాగి జావ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది: రాగి పిండిలో పలు రకాల అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో తోడ్పడతాయి.
జీవక్రియల మెరుగుదల: రాగిలోని పోషకాలు కండరాల ఆరోగ్యానికి, రక్తం తయారవ్వడానికి, జీవక్రియలు సాఫీగా జరగడానికి దోహదపడతాయి..
ఫైబర్ ప్రయోజనాలు: రాగుల్లోని ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీని వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
రాగి జావ ఎలా తయారు చేయాలి.. ఎప్పుడు తీసుకోవాలి..?
రాగి జావను సులభంగా తయారు చేసుకోవచ్చు.. ముందుగా నీటిలో కొంచెం (2-3 స్పూన్ల పిండిని కలుపుకోవాలి.. ముద్దలు కాకుండా చూడాలి.. అలాగే.. రెండు, మూడు గ్లాసుల నీటిని వేడి చేసి.. దానిలో ఈ రాగి పిండి వేస్తూ కలుపుకోవాలి.. సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.
అయితే.. రాగి జావను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం అత్యంత ఆరోగ్యకరం.. టిఫిన్ గా కూడా తీసుకోవచ్చు లేదా.. టిఫిన్ కంటే ముందు కూడా రాగి జావ తాగొచ్చు.. అంతేకాకుండా.. రాత్రి నిద్రకు ముందు కూడా దీనిని తీసుకోవచ్చు.
కావాలంటే.. రాగి జావలో మజ్జిగ, పెరుగు కూడా కలుపుకుని తీసుకోవచ్చు.. దీనికి తోడు కొంచెం పచ్చి మిర్చి, ఉల్లి తురుము జోడించుకుంటే.. రుచి పెరుగుతుంది.. ఇలా తీసుకోవడం వల్ల ఎండలో వేడి చేయకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

