ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పీఎం కిసాన్ యోజనతో పాటుగానే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తూ ఉండటంతోనే.. ఉగాదికి ముందుగా మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. మొత్తం రూ.6000 రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మార్చి 13వ తేదీన అస్సాంలోని గౌహతిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరోవైపు కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసిన రోజే.. ఏపీ ప్రభుత్వం కూడా అన్న దాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 13వ తేదీనే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన కింద రూ.2000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4000 కలిపి అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6000 జమయ్యే అవకాశం ఉంది. ఉగాదికి ముందు ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
మరోవైపు పీఎం కిసాన్ యోజన సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మరోసారి స్పష్టం చేసింది. పీఎం కిసాన్ లబ్ధి అందుకోవటానికి రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని.. ఇందుకోసం సమీప సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ కోసం పీఎం కిసాన్ సైట్ సందర్శించవచ్చు. లేదా బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ చేయాలంటే కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.10000 లను అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసింది. మూడో విడతగా మరో నాలుగు వేలు అందించనుంది. సంక్రాంతి సమయంలోనే ఈ డబ్బులు జమ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ.. వివిధ కారణాలతో జాప్యం జరిగింది. అయితే తాజాగా మార్చి 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


