Bitter Gourd: కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు పదేపదే చెబుతుంటారు. కానీ కాకరకాయను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కారణం చేదుగా ఉండడమే. కానీ ఇందులో ఉండే పోషకాలు అంతా ఇంతా కావు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి ఔషంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది వైద్యులు కూడా వారానికి ఒకసారి అయినా కాకరకాయ తినాలని సిఫార్స్ చేస్తుంటారు. అయితే ఈ కూరలో చేదు వల్ల ఎవరూ దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ కొన్ని టిప్స్‌తో కాకరకాయలో ఉండే చేదును కూడా పోగొట్టవచ్చు. పిల్లలు సైతం తినేందుకు ఇష్టపడుతుంటారు. మరి ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం..
ఇలా చేదును తగ్గించండి: కాకరకాయను కట్ చేసిన తర్వాత ఉప్పు రాసి కొంతసేపు పక్కన ఉంచాలి. చిన్న చిన్న ముక్కులుగా కోసి వాటికి ఉప్పు బాగా రాయాలి. తర్వాత వాటిని సుమారు 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. కొద్దిసేపటికి కాకరకాయ నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీటిని చేతితో పిండేస్తే చేదు దాదాపుగా తగ్గిపోతుంది.ఇలా చేసిన తర్వాత కాకరకాయతో చేసే వేపుడు, కూర లేదా పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది.
గింజలు తీసేయడం వల్ల చేదు తగ్గుతుంది: ఇక మరో చిట్కా ఏంటంటే కాకరకాయలో గింజలను తీసివేయడం వల్ల కూడా చేదు తగ్గుతుందట. సాధారణంగా కాకరకాయ లోపల ఉండే గింజలు, తెల్లని పొర ఎక్కువగా చేదుగా ఉంటుంది. అందుకే వంట చేయడానికి ముందు కాకరకాయను మధ్యలో కోసి గింజలు తీసేయడం మంచిది. అలాగే పై తొక్కను కూడా కొంచెం తురిమేస్తే చేదు తగ్గుతుంది.
ఉప్పు కలిపిన నీటిలో ఉంచడం: ఇక కాకరకాయను ఉప్పు కలిపిన వేడి నీటిలో కొద్దిసేపు మరిగించడం వల్ల కూడా చేదు తగ్గుతుంది. ముక్కలుగా కట్ చేసిన కాకరకాయను వేడి నీటిలో 3 నుంచి 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. తర్వాత వాటిని నీటితో కడిగి కూరగా వండితే చేదు తక్కువగా ఉంటుంది.
ఇలా కూడా చేయండి: అలాగే కాకరకాయ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువగా వేస్తే కూడా రుచి మారుతుంది. కొంతమంది చింతపండు రసం లేదా కొద్దిగా బెల్లం వేసి కాకరకాయ కూర చేస్తారు. ఇలా చేస్తే చేదు రుచి తగ్గి కూర తీపి,పులుపు కలిసిన రుచిగా ఉంటుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించడవ వల్ల కాకరకాయలో చేదును తగ్గించుకోవచ్చు.






