Andhra Pradesh Highest Temperatures Recorded: ఏపీలో మరోసారి సూర్యుడి భగభగలు మొదలయ్యాయి. కొద్దిరోజుల పాటూ గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది. బుధవారం 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు మరోసారి 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతంది అంటున్నారు,. ఇదిలా ఉంటే ఈ నెల 16, 17 తేదీల్లో వానలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.
హైలైట్:
- ఏపీలో మరోసారి పెరిగిన ఎండల తీవ్రత
- కర్నూలులో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఈ నెల 16,17న తేలికపాటి వానలకు ఛాన్స్

రాష్ట్రంలో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026 పేరుతో కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఈ ఏడాది సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉండబోతోందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. సాధారణం కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వేడిగాలుల తీవ్రత పెరుగుతుందన్నారు.
అన్నిశాఖలు సమన్వంతో పనిచేయాలని మంత్రి అనిత అధికారులకు సూచించారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. అలాగే అంబులెన్సులను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండేచోట చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక సేవా సంస్థల సాయంతో ఉచితంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మొత్తానికి ఈ ఏడాది ఎండల తీవ్రత కాస్త గట్టిగానే ఉండే అవకాశం ఉందంటున్నారు.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


