
జాతి కోడి పుంజుల, జాతి కోడి పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, బలం కోసం ప్రత్యేకమైన దాణా తయారీ పద్ధతులు చాలా ముఖ్యం. ఈ దాణాను ఐదు రకాల మిల్లెట్స్‌తో తయారుచేయవచ్చు, ఇవి కోడి పుంజులకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ప్రధానంగా ఉపయోగించే మిల్లెట్స్ గోధుమలు, సజ్జలు, సగం దంచిన వడ్లు, జొన్నలు, రాగులు వినియోగించడం ద్వార బలవర్ధకమైన మేత తయారువుతుంది.
తయారీ విధానం: ముందుగా, ఐదు రకాల మిల్లెట్స్‌ను సిద్ధం చేసుకోవాలి.
1. జొన్నలు: ఇవి కోడి పుంజులకు అధిక కాల్షియం, కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, వాటి ఎదుగుదలకు, బలానికి తోడ్పడతాయి.
2. సగం దంచిన వడ్లు: వీటిలోని గరికను తొలగించి, శుభ్రంగా దంచి ఉపయోగించాలి.
3. సజ్జలు: చిన్నవి లేదా పెద్ద రకాల సజ్జలను ఉపయోగించవచ్చు.
4. గోధుమలు: ఇవి ఫైబర్, ప్రోటీన్‌ను అందిస్తాయి. గోధుమలను నేరుగా లేదా నూకగా చేసి ఉపయోగించవచ్చు.
5. రాగులు (చోళ్ళు): వీటిని పొట్టుతో సహా ఉపయోగిస్తే పోషక విలువలు అధికంగా ఉంటాయి. పొట్టు తీసిన రాగులను కూడా వాడవచ్చు. ఈ ఐదు రకాల మిల్లెట్స్‌ను ఒక పెద్ద పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ దాణాను రెండు రకాలుగా అందించవచ్చు.
పొడి దాణా: మిల్లెట్స్ మిశ్రమాన్ని నేరుగా కోడి పుంజులకు అందించవచ్చు. అయితే, వీటిని 15 నుండి 20 నిమిషాలు నానబెట్టి ఇస్తే, జీర్ణం సులభమవుతుంది. తినడానికి మరింత మృదువుగా ఉంటాయి. నానబెట్టకపోయినా, నేరుగా పొడిగా అందించవచ్చు.
తడి దాణా (తవుడుతో): కోడి పుంజులకు మరింత బలం రావాలంటే, ఈ మిల్లెట్ మిశ్రమానికి కొద్దిగా తవుడును కలిపి తడి దాణాగా అందించవచ్చు. తవుడు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తవుడు శాతం మొత్తం దాణాలో 10% మించకూడదు. ఎక్కువ తవుడు వాడకం కోడి పుంజులకు కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. తవుడును కలిపి తడి దాణాగా తయారుచేసిన తర్వాత, దానిని వెంటనే కోడి పుంజులకు తినిపించాలి. లేనిపక్షంలో, నీరు కలవడం వల్ల అది పులిసిపోయి, పాడైపోయే అవకాశం ఉంది. అందువల్ల, ప్రతి పూటకి సరిపడా దాణాను మాత్రమే తయారుచేయాలి.
ఇతర ముఖ్య సూచనలు:
ఫీడర్లు: దాణాను వృథా చేయకుండా, శుభ్రంగా ఉంచడానికి తప్పనిసరిగా ఫీడర్లను ఉపయోగించాలి. సాధారణ గిన్నెల్లో పెడితే కోడి పుంజులు దాణాను చుట్టూ చల్లేసి వృథా చేసే అవకాశం ఉంది.
వ్యాయామం: కేవలం మంచి దాణా అందించడమే కాకుండా, కోడి పుంజులకు తగిన వ్యాయామం కూడా చేయించాలి. దీనివల్ల అవి బలంగా, దృఢంగా తయారవుతాయి. ఈ ప్రత్యేక దాణా ఖరీదైనది కాబట్టి, జాతి కోడి పుంజులకు మాత్రమే దీనిని అందించడం మంచిది. సాధారణ కోళ్ళకు తక్కువ ఖర్చుతో కూడిన ఇతర దాణాలను వాడవచ్చు. ఈ పద్ధతులు పాటించడం ద్వారా జాతి కోడి పుంజులను ఆరోగ్యంగా, బలంగా పెంచవచ్చు.

