ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన ఆరో సదస్సు ఇది. ఇందులో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు సహా కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా చివర రోజున సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచనలు చేశారు.
హైలైట్:
- అమరావతిలో ఆరో కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం
- సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు సీఎం ప్రకటన
- అన్నదాత సుఖీభవ నిధులు, 2.5 లక్షల గృహప్రవేశాలు

పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా సాగేలా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని సీఎం ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటిస్థలం లేదా ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది పండుగ రోజున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి, 2.50 లక్షల మందికి ఇళ్లను అందజేయనున్నట్టు తెలిపారు. జల జీవన్ మిషన్ కింద ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ‘స్త్రీ శక్తి’ పథకం కింద మార్చి 9 వరకు ఆర్టీసీలో రా 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని.. ఇందుకు గానూ రూ.1,775 కోట్లను ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని సీఎం వివరించారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సహకారంతో పీ4 సహా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్లకు సీఎం దిశ నిర్దేశనం చేశారు.


