వైఎస్సార్ కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య గదిలో ఉరి వేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే.. ఆపాల్సింది పోయి.. ఓ భర్త నవ్వుతూ కిటికీలో నుంచి వీడియో తీశాడు. సరిగ్గా వేసుకో.. అలా కాదంటూ.. ఉచిత సలహాలు కూడా అందించాడు. భార్య తనను బెదిరించేందుకు ఇలా చేస్తోందని అనుకున్నాడేమో తెలియదు కానీ.. అతని కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఆ ఇల్లాలు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య గురువారం మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్యకు యత్నించారు. గది తలుపులకు గడియ పెట్టుకున్న కృష్ణవేణి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త శ్రీనివాస్.. అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. భార్య ఉరివేసుకుంటున్న దృశ్యాలను కిటీకీ నుంచి వీడియో తీయటం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఉరి ఎలా వేసుకోవాలనే దానిపై భార్యకు కిటికీలో నుంచి ఉచిత సలహాలు అందించారు. ఈ విషయం మొత్తం తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు.
భర్త చేసిన పనితో మరింత మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని, తలుపులు బద్ధలు కొట్టారు. అయితే అప్పటికే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శ్రీనివాస్ అలా వీడియో తీయటం వెనుక కారణాలను ఆరా తీస్తున్నారు. భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే శ్రీనివాస్ తీసిన వీడియో ఎలాగో బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. భార్య ఉరివేసుకుంటూ ఉంటే.. కాపాడాల్సింది పోయి ప్రోత్సహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు శ్రీనివాస్‌కు ఇది రెండో వివాహమని.. మొదటి భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని.. కృష్ణవేణి కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఆ విషయాన్ని దాచి కృష్ణవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడని.. నిత్యం వేధించేవాడని చెప్తున్నారు.


