
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేషన్ సేవలను డిజిటలైజ్ చేసింది. ఇక నుంచి యాప్ ద్వారానే రేషన్‌కు సంబంధించి సేవలన్నీ దేశ ప్రజలు పొందవచ్చు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి మీరు ఎంత రేషన్ తీసుకున్నారనే విషయం వరకు ప్రతీది ఇంటి వద్దనే చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడంతో పాటు దాని స్టేటస్ తెలుసుకునేందుకు మీరు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇక మీ రేషన్ కోటా ఎంత ఉంది..? ఇప్పటివరకు ఎంత తీసుకున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు రేషన్ షాపు వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొబైల్ యాప్ ద్వారానే ఇంటి వద్ద అన్నీ విషయాలు చిటికెలో తెలుసుకోవచ్చన్నమాట.
ఉమాంగ్ యాప్‌లో మేరా రేషన్
ఉమాంగ్ యాప్‌లో కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇంట్లో కూర్చోని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి మీకు ఎంత రేషన్ వచ్చింది..? ఇప్పటివరకు ఎంత రేషన్ తీసుకున్నారు? అనే విషయాలను ఇందులోనే తెలుసుకోవచ్చు. మీ రేషన్ కార్డుకు సంబంధించిన సమగ్ర వివరాలు అన్నీ ఈ ఫీచర్ ద్వారా ఒకేచోట యాక్సెస్ చేయవచ్చు. రేషన్ కార్డు అనేది దేశంలో నివసించే పేదలకు అతి ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతీ నెలా ఇంట్లోకి అవసరమయ్యే రేషన్ సరుకులు ప్రభుత్వం నుంచి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. తక్కువ ధరకే దుకాణాల ద్వారా సబ్సిడీపై నిత్యావసర సరుకులు పొందవచ్చు.
‘మేరా రేషన్ ఫీచర్’ ప్రయోజనాలు
-రేషన్ వినియోగాన్ని సులభంగా ట్రాక్ చేయవచ్చు
-ఒక కుటుంబానికి నెలకు ఎంత రేషన్ అందిందనే సమాచారం యాక్సెస్ చేయవచ్చు
-ఇప్పటివరకు ఎంత రేషన్ అందుకున్నారే వివరాలు తెలుసుకోవచ్చు
-మీ రేషన్ వాటా తగ్గుతుందోలేదో అర్థం చేసుకోవచ్చు
-వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు సమీపంలోని రేషన్ దుకాణాలను గుర్తించవచ్చు
-గత రేషన్ లావాదేవీల హిస్టరీని వీక్షించవచ్చు
-సమీపంలోని రేషన్ దుకాణాల అడ్రస్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పొందవచ్చు
ఫీచర్ ఎలా వాడాలంటే..?
-ఉమాంగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి
-మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-4 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోండి
-హోమ్ పేజీలో సెర్చ్ బాక్స్‌లో మేరా రేషన్ అని టైప్ చేయండి
-రేషన్ కార్డు సేవలపై క్లిక్ చేయండి
-రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి
-రేషన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు

