తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడుసార్లు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఉగాది, శ్రీరామనవమిని పురస్కరించుకుని మూడుసార్లు ఆస్థానాలు జరగనున్నాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 28న పట్టాభిషేక ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. మరోవైపు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో మార్చి 24 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.

మరోవైపు మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా గరుడాళ్వార్ సన్నిధిలో ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆస్థానం జరగనుంది. శ్రీరామనవమి పండుగ పూర్తైన తర్వాతి రోజు అంటే మార్చి 28వ తేదీ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టాభిషేక ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఘట్టాన్ని పఠిస్తారు.
పట్టాభిరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురంలో కొలువైన పట్టాభిరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పట్టాభిరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి17వ తేదీ ఉదయం పట్టాభిరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామిని మేలుకొలుపుతారు. అనంతరం తోమాలసేవ, సహస్రనామార్చన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 23ను అంకురార్పణ జరగనుంది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకూ అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం వంటి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.


