
సినిమా విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. కానీ, ఆ చిత్రం ఇప్పటికీ ఆయన బ్యాంకు ఖాతాలోకి లక్షల రూపాయలను తెచ్చిపోస్తోంది. ఒక హాలీవుడ్ సినిమా భారతీయ నటుడిని ఎలా నిజమైన మిలియనీర్‌ను చేసిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన ఏజ్‌లెస్ లుక్స్‌తో, ఎనర్జీతో నేటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న ఆ సీనియర్ స్టార్.. అనిల్ కపూర్. 2008లో వచ్చిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో తాజాగా జరిగిన ఒక సదస్సులో ఆయన స్వయంగా వెల్లడించారు.
మిలియనీర్‌ను చేసిన ‘స్లమ్‌డాగ్’
“నేను ఈ విషయం మీతో పంచుకోవాలి.. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నిన్ననే నాకు ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ టీమ్ నుంచి మళ్ళీ ఒక పే చెక్ వచ్చింది” అని అనిల్ కపూర్ వెల్లడించారు. ఎంత మొత్తం వచ్చిందని అడగ్గా.. “నిన్న 3,000 పౌండ్లు (సుమారు 3.3 లక్షల రూపాయలు) వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా ద్వారా నేను దాదాపు అర మిలియన్ పౌండ్లు (సుమారు 5.5 కోట్ల రూపాయలు) సంపాదించాను. అందుకే నేను నిజంగానే మిలియనీర్‌ను అయ్యాను” అని సంతోషం వ్యక్తం చేశారు. విచిత్రం ఏంటంటే, ఈ సినిమా మొదలయ్యేటప్పుడు బడ్జెట్ తక్కువగా ఉండటంతో ఆయన ఉచితంగానే నటించడానికి సిద్ధపడ్డారట.
నిజానికి అనిల్ కపూర్ కేవలం డబ్బు కోసం ఈ సినిమా చేయలేదు. హాలీవుడ్ మేకింగ్ ఎలా ఉంటుంది? డానీ బోయల్ వంటి గొప్ప దర్శకుడి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, తనను తాను ఎడ్యుకేట్ చేసుకోవడానికే ఆ ప్రాజెక్టులో భాగమయ్యారట. నేటికీ తను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం నిరంతరం నేర్చుకోవాలనే తపనే అని ఆయన చెప్పుకొచ్చారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలో ఆయన క్విజ్ మాస్టర్ ప్రేమ్ కుమార్ పాత్రలో అద్భుతంగా నటించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.
Sdm
69 ఏళ్ల వయసులోనూ అనిల్ కపూర్ కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇటీవల ఆయన నటించిన యాక్షన్ డ్రామా ‘సుబేదార్’ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. త్వరలోనే ఆయన ‘ఆల్ఫా’ అనే భారీ బడ్జెట్ సినిమాలో కనిపించబోతున్నారు. శివ్ రావైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, శర్వరీ వాఘ్ మరియు బాబీ దేఓల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రంగంలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైతే అనిల్ కపూర్ లాగా దశాబ్దాల పాటు ఆదాయం, కీర్తి రెండూ దక్కుతాయి. తన అద్భుతమైన నటనతో ప్రపంచాన్ని మెప్పించిన అనిల్ కపూర్, రాబోయే సినిమాలతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

