ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం తిరుమలను సైతం తాకింది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలను మూసివేస్తున్న పరిస్థితి. గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో కార్యకలాపాలు సాగించలేక.. నిర్వాహకులు వీటిని మూసివేస్తున్నారు. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ గోడౌన్ల వద్ద హోటల్స్ నిర్వాహకులు క్యూ కడుతున్నారు. మరోవైపు గ్యాస్ సరఫరాలో ఆటంకం లేకుండా టీటీడీ ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

వెంకన్న దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వేసవి సెలవులు, పండుగల సీజన్‌లలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో టీటీడీ నిర్వహించే నిత్యాన్నదాన కేంద్రాలతో పాటుగా.. పలు హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. వీటి ద్వారా భక్తులకు కావాల్సిన టిఫిన్లు, వెజిటబుల్ రుచులు అందిస్తున్నారు. వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించే భక్తులు.. కాఫీలు, టీలు , టిఫిన్లు వంటి వాటి కోసం తిరుమలలోని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ షాపులపై ఆధారపడుతుంటారు. అయితే ఎల్పీజీ గ్యా్స్ కొరత కారణంగా వీటిని మూసివేస్తూ ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం పడకుండా టీటీడీ ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఐదు ట్యాంకులలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉంచుకుంది. తిరుమల లో అన్నదాన కేంద్రాలలోని కిచెన్లు, తిరుమల లడ్డూ తయారీ కోసం నిత్యం పెద్ద ఎత్తున గ్యాస్ అవసరం అవుతూ ఉంటుంది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే.. అన్నదాన కేంద్రాల నిర్వహణ, లడ్డూ తయారీకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ముందే అప్రమత్తమై.. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అలాగే గ్యాస్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా గ్యాస్ సంస్థలతోనూ సంప్రదింపులు జరిపింది తిరుమల తిరుపతి దేవస్థానం.


