50 రోజుల తర్వాత పోలీసులు సీజ్ చేసిన తన కారును విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కోర్టు ఆదేశాలతో సీజ్ చేసిన తన కారును విడుదల చేసిన పోలీసులు.. ఆ కారును పగలగొట్టిన వారిని మాత్రం స్టేషన్‌లో పెట్టలేకపోయారంటూ పోలీసులపై అంబటి రాంబాబు పంచులు వేశారు. చంద్రబాబు. నారా లోకేష్ పాలన అంటే ఇలాగే ఉంటుందని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్న వాహనాలను కొంతమంది కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కొన్ని గంటల పాటు అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాత్రి సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో.. ఉద్రిక్తతలు చల్లారాయి. ఇదే సమయంలో ఆయన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. 50 రోజుల తర్వాత కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబు కారును పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీసుల్లో పరిస్థితి.. ఎంత దారుణంగా ఉందంటే!
మరోవైపు అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయటంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తన కారును 50 రోజుల పాటు సీజ్ చేసిన పోలీసులు.. దానిని పగలగొట్టిన వారిని మాత్రం స్టేషన్‌లో పెట్టలేదని అంబటి రాంబాబు విమర్శించారు. ఇదీ చంద్రబాబు, నారా లోకేష్ పాలన అంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలపై విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు గుంటూరులో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ తొలగించేందుకు అంబటి రాంబాబు వెళ్తున్న సమయంలో.. ఆయనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సమయంలోనే అంబటి రాంబాబు, టీడీపీ కార్యకర్తల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలోనే చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనం రేపాయి.


