లక్ష రూపాయలు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధురాలిని కొంతమంది స్వామీజీలు బెదిరించిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మణి అనే మహిళ ఇంటికి వచ్చిన నలుగురు వ్యక్తులు, తాము స్వామీజీలమని పరిచయం చేసుకున్నారు. తమ ఆశ్రమంలోని గోవుల సంరక్షణ కోసం రూ. లక్ష ఇవ్వాలని.. లేకపోతే శపిస్తామని బెదిరించారు. దీంతో మహిళ తన వద్ద ఉన్న ఐదు వేలు వారికి ముట్టజెప్పింది. అనంతరం భయంతో పోలీసులను ఆశ్రయించారు.

లక్ష రూపాయలు ఇవ్వకపోతే శపిస్తామని ఆమెను భయపెట్టారు. దీంతో భయపడిన పోయి మణి.. తన వద్ద కేవలం రూ.5000 మాత్రమే ఉన్నాయంటూ ఆ మొత్తాన్ని వారికి అందించారు. అయితే ఇదే సమయంలో మణి మేనల్లుడు ఊరు నుంచి వచ్చాడు. అపరిచిత వ్యక్తులు అతణ్ని కూడా బెదిరించి అతని వద్ద నుంచి మరో వేయి రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే స్వామీజీల రూపంలో ఇంటికి వచ్చినవారు బెదిరించటంతో మణి, ఆమె మేనల్లుడు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు.
దీంతో ఉయ్యూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరినీ విచారించారు. అనంతరం బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో స్వామీజీలు ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా వచ్చినవారు ఎవరనే దానిపై ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు అపరిచిత వ్యక్తులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే.. భయపడవద్దని పోలీసులు చెప్తున్నారు.
అలాంటి వారి గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అలాగే నకిలీ స్వామీజీల మోసాలపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలతో పాటుగా ఇలా ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించేవారు, విరాళాలు అడిగి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


