Repalle Ysrcp In Charge Pita Naga Mohan Krishna: హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న ఏపీ మంత్రి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గానికి కొత్తగా పీట నాగ మోహన్ కృష్ణను సమన్వయకర్తగా నియమించింది. రేపల్లెలో పార్టీని బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేసింది. రేపల్లె బాధ్యతలు చేపట్టిన వెంటనే మోహన్ కృష్ణ నియోజకవర్గంలో పర్యటనలు మొదలు పెట్టారు.
హైలైట్:
- ఏపీ మంత్రి నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంఛార్జ్
- రేపల్లె బాధ్యతలు నాగ మోహన్‌కు అప్పగింత
- ఆ మంత్రికి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డ్

రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు.. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పోటీచేసి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల్లోనూ మోపిదేవికి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు.. రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా రేపల్లెలో మాత్రం ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రేపల్లెలో ఓడిపోయిన మోపిదేవికి వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేశారు. కానీ 2020లో రాజకీయ పరిణామాలు మారడంతో వెంకటరమణ మంత్రి పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. ఆ వెంటనే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కింది.
2024 ఎన్నికలకు ముందు మోపిదేవి వెంకటరమణను కాదని రేపల్లెలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మార్చేసింది. డాక్టర్ ఈవూరు గణేష్‌కు టికెట్ ఇవ్వగా.. మోపిదేవి ఆయనకు మద్దతు తెలిపారు. అయినా సరే 2024లోనూ అనగాని సత్యప్రసాద్ చేతిలో గణేష్ ఓడిపోయారు. ఇలా వరుసగా మూడుసార్లు వైఎస్సార్‌సీపీకి ఓటమి ఎదురుకగా.. ఇంతలో రేపల్లెలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈవూరు గణేష్ కూడా నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్నారనే టాక్ ఉంది. దీంతో రేపల్లెలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది.. పీటా నాగ మోహన్ కృష్ణవైపు మొగ్గు చూపింది. ఆయన రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. మరి కొత్త ఇంఛార్జ్‌తోనైనా రేపల్లెలో లక్ మారుతుందుమో చూడాలి.


