ఉగ్రవాదులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు యువకులకు విజయవాడ సీసీఎం కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నాయంటూ ముగ్గురు యువకులను విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి ఉగ్రవాద భావజాలాన్ని యువతలో ప్రోత్సహించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.

మరోవైపు ముగ్గురు నిందితులను విజయవాడ పోలీసులను విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఏప్రిల్ ఆరో తేదీ వరకూ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వీరిని విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు విచారణ సందర్భంగా లాయర్‌ను నియమించుకున్నారా? అని న్యాయమూర్తి నిందితులను ప్రశ్నించారు. అయితే తాము నియమించుకోలేమని నిందితులు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో యాంటీ టెర్రరిస్ట్ దళాలు జరిపిన విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురు యువకులు ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో గ్రూపును ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఏడు రాష్ట్రాలలో 42 మంది సభ్యులతో ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్రూపు ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ముఖానికి మాస్కులతో ఫోటోలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు, ఆడియోలు పెడుతున్నట్లు గుర్తించారు. పాకిస్థాన్ , అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణకు వెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


