అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. రాయపూడి అగ్నిప్రమాద ఘటనలో ప్లాస్టిక్ పైపులు కాలిపోయిన ఘటనపై చర్చించారు. వరుస అగ్నిప్రమాదాలు ప్రమాదవశాత్తూ జరుగుతున్నాయా.. లేక వీటి వెనుక ఏదైనా కుట్ర ఉందే అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మేఘా కంపెనీకి చెందిన పైపులు కాలిపోయాయి.

మరోవైపు సోమవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలోని హెచ్ఓడీ టవర్స్ నిర్మాణం వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డిపార్టుమెంట్ అధికారులు.. మూడు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు ఇటీవలే వెలగపూడి సమీపంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎల్అండ్‌టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు మంటల్లో కాలిపోయాయి. ఆ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఆ దర్యాప్తు పూర్తికాకముందే మరో అగ్నిప్రమాదం జరగటంతో.. వీటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరోవైపు అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై హోం మంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో పలు అనుమానాలను వంగలపూడి అనిత వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగిందన్న హోం మంత్రి అనిత.. దాన్ని ఓర్వలేక అమరావతిలో పైపులకు నిపు పెట్టారా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. గతంలో అమరావతిలో అరటితోటకు నిప్పు పెట్టిన ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ చేయాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు. అమరావతిపై కుట్రలు పన్నితే సహించేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు.


